26 July, 2026 | 2:17 AM

అర్థవంతమైన పాత్రలకు తమిళ చిత్రసీమ సరైన వేదిక

26-07-2026 12:00 AM

టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ‘మిరాయ్ -2’ నటిస్తుండగా, హిందీలో ‘ది ఇన్‌ఫ్లూయెన్సర్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లోనూ భాగమైంది. ఇదిలావుంటే ఈ ముద్దుగుమ్మ తన కెరీర్, సినిమాల ఎంపిక, వ్యక్తిగత జీవితంపై తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినిమాల ఎంపిక, కెరీర్‌పై ఆమె స్పందిస్తూ తమిళ చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించింది.

“నాది చాలా సున్నితమైన మనస్తత్వం. అందుకే భావోద్వేగాలు ఎక్కువగా బయటపెట్టలేను. వృత్తిపరంగా బాగా కష్టపడతా. ‘హరిహరవీరమల్లు’, ‘రాజాసాబ్’ సినిమాల్లో స్టార్స్‌తో కలిసి నటించటం అదృష్టంగా భావిస్తున్నా. మంచి దర్శకులతో అర్థవంతమైన పాత్రలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నా. అలాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న, అర్థవంతమైన పాత్రలు చేయడానికి తమిళ చిత్రసీమ సరైన వేదిక. ఇకపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటా.

కెరీర్ ఆరంభంలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల వచ్చిన అవకాశాల్లోనే ఉత్తమమైనవి ఎంచుకోవాల్సి వచ్చింది. నా జీవితంలో దేనికీ నేను తొందరపడను. సినిమాల విషయంలోనూ ఎలాంటి తొందరపాటు లేదు. పెళ్లి విషయంలో కూడా అంతే. నా వ్యక్తిగత విషయాల గురించి ఇంకా చెప్పాలంటే.. నేను అత్యంత సోమరిని. మంచి ప్రాజెక్టులు వస్తే సినిమాలు చేస్తా. ఇప్పుడు తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నా.

అందుకే తమిళంలో నటించడం మిస్ అవుతున్నా. ఇప్పుడు మరో రెండు కొత్త ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయి. భూమి’, ‘కళగ తలైవన్’ తర్వాత తమిళంలో సినిమాలు చేయలేదని, సరైన ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నా” అని తెలిపింది అందాల నిధి.