టీసీఏ ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా మార్చాలి
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపు
హెచ్‌సీఏ హైదరాబాద్‌కే పరిమితమైంది
టీసీఏతోనే జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)తోనే సాధ్యమవుతుందని ఎంపీ, టీసీఏ ప్యాట్రన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరిత ప్లాజాలో టీసీఏ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం జరిగింది. దీనికి క్రి కెట్ నిర్వాహకులు, మాజీ క్రీడాకారులు, మహిళా క్రికెటర్లు, జిల్లా ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు మరియు వివిధ వర్గాల క్రీడా భాగస్వాములు పాల్గొన్నారు.
సమావేశం ఆరంభంలో టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీసీఏ ఆవిర్భావం, న్యాయపర మైన పోరాటాలు, సంస్థ విస్తరణ, సభ్యత్వ వృద్ధి, గ్రామీణ క్రికెట్ అభివృద్ధి మరియు గత దశాబ్దంలో తెలంగాణ క్రీడాకారులు సా ధించిన ప్రగతిని వివరించారు.
అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల ఎంపీ, టీసీ ఏ పాట్రన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, హెచ్‌సీఏ హైదరాబాద్‌కే పరిమితమై తెలంగాణ జిల్లాల క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలంగాణ గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు టీసీఏ నిరంతరం కృషి చేస్తోందని, బీసీసీఐ టీసీఏకు అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తే వేలాది మంది క్రీడా కారులకు జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. టీసీఏ గుర్తింపు కోసం ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ప్రజా ఉద్యమా ల మాదిరిగానే క్రికెట్ పరిపాలనలోని అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. టీసీఏకు బీసీసీఐ అసోసియేట్ సభ్యత్వం సాధించే వరకు సామాజిక మాధ్యమాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రజాస్వామ్యబద్ధ ఆందోళనలను విస్తృతంగా నిర్వహించా లని సూచించారు. హెచ్‌సీఏపై వెలుగుచూసిన అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యం లో కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.






