టెక్నీ పని విధానం మారాలి
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. జూలై 10న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి బ్లాక్‌బస్టర్ వైభవం పేరుతో మేకర్స్ ఓ ఈవెంట్‌ను జరిపారు. ఈ సెలెబ్రేషన్స్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా టీమ్‌కు షీల్డులను అందించారు. ఈ కార్యక్ర మంలో నాగార్జున మాట్లాడుతూ.. “అందరూ ప్రేమించి ఈ మూవీని చేశారు. ఆ ప్రేమను ఆడియెన్స్, అభిమానులంతా తిరిగి చూపించారు. ఈ ప్రేమ కోసం, అరుపుల కోసమే అఖిల్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు.
నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. ఒకప్పుడు మేం నెల రోజుల ముందే ఫైనల్ కాపీ చూసేవాళ్లం. ఇప్పుడు టెక్నీషియన్ల వల్ల సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. అందరూ రెండు వారాల ముందే సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కి ఇవ్వాలని కోరుతున్నా” అని అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ.. “ఈ కథకు ఓకే చెప్పిన వెంటనే అఖిల్ సక్సెస్ కొట్టాడని ఫిక్స్ అయ్యాను. ఓ అన్నయ్యగా ఎంతో గర్వంగా ఉంది” అని చెప్పారు. ‘మూడు రోజుల్లోనే లెనిన్ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంద’ని అఖిల్ అక్కినేని తెలిపారు. డైరెక్టర్ మురళీ కిషోర్, నిర్మాత నాగవంశీ, మిగతా టీమ్ కూడా మాట్లాడారు.






