బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు వేళాయె..

09-09-2026 | 05:25am
  1. ఉత్సవాలకు సిద్ధమవుతున్న మండపాలు

ఏర్పాటులో జాగ్రత్తలు తప్పనిసరి

పాపన్నపేట, సెప్టెంబర్ 8:  తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు గణపయ్య. అంతటి మహిమాన్వితమైన వినాయక చవితి (Vinayaka Chavithi) పండగ రానే వచ్చింది. సోమవారం నుంచి గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటికే భక్తులు ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

విగ్రహ మండపాల ఏర్పాటు పూజలు ఊరేగింపు నిమజ్జనం ఇలా ప్రతి సందర్భంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే నిజంగా వినాయక నవరాత్రులు విజయవంతం అవుతాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలను ఓ సారి చూద్దాం.

అప్రమత్తత ఎంతో ముఖ్యం

గణపయ్య నవరాత్రి ఉత్సవాలంటే సామూహిక వేడుకలు, సాయంత్రం అయిందంటే మండపాల వద్ద భక్తులు గణనాథుని దర్శనం కోసం బారులు తీరుతారు. ప్రతి విషయంలో అప్రమత్తత ఎంతో ముఖ్యం. మండపాల వద్ద నిర్వాహకులు రాత్రివేళ పడుకుంటే విగ్రహాలు, మండపాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. పట్టణాలు, నగరాల్లో చోరీలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిర్వాహకులు జాగ్రత్తలు వహించాలి.

ముఖ్యంగా విద్యుత్తు ప్రమాదాలకు దూరంగా..

 చాలా మండపాల నిర్వాహకులు అనధికారికంగా విద్యుత్తు కనెక్షన్లు తీసుకుంటారు. ఇక్కడే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అధికారిక కనెక్షన్లు అయితే విద్యుత్ సిబ్బంది వచ్చి పరిశీలించి ప్రమాదాలకు అవకాశం లేకుండా వైరింగ్ వంటివి అన్నీ సక్రమంగా ఉండేలా కనెక్షన్ మంజూరు చేస్తారు.

ఇది భద్రతకు భరోసా ఇస్తుంది. మండపాలను విద్యుత్తు తీగల కింద ఏర్పాటు చేయొద్దు, అలాంటి పరిస్థితి ఉంటే విగ్రహాలను వాహనాల నుంచి దించేటప్పుడు మండపంలో ప్రతిష్టించేటప్పుడు చుట్టుపక్కల పై భాగాల్లో పరిశీలించి చూసుకోవడం మంచిది.

పకడ్బందీగా మండపాల నిర్మాణం..

గణనాథులు కొలువుదీరేందుకు ఏర్పాటు చేసే మండపాలు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి. నిర్మాణానికి ఉపయోగించే కర్రలు, సామాగ్రి నాణ్యమైనవి వాడాలి. వర్షం, గాలి దుమారం వచ్చినప్పుడు పడిపోకుండా ఉంటాయి. విగ్రహాల వద్ద దీపాలు వెలిగిస్తుంటారు, వాటి దగ్గరలో వివిధ రకాల అగ్నిని ప్రజ్వలింపజేసే సామాగ్రి ఉంచకూడదు.

రహదారికి అడ్డంగా మండపాలను ఏర్పాటు చేస్తే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వీలైనంతవరకూ ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది.

ఖర్చులు తగ్గిస్తే మేలు

వినాయక చవితి వచ్చిందంటే యువకులకు పట్టలేనంత ఉత్సాహం వస్తుంది. ఈ సమయంలో నిర్వాహకులు చందాలు వసూలు చేస్తుంటారు. అయితే డిమాండ్ చేయకుండా భక్తులు ఇచ్చింది తీసుకోవడం శ్రేయస్కరం. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు డీజే, ఇతరత్రా అధికంగా ఖర్చు చేయడం కంటే అన్నదానాలు, పిల్లలకు విజ్ఞాన, వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితంగా ఉంటుంది.

భక్తికే ప్రాధాన్యం

 పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉండే మండపాల వద్ద శబ్ద కాలుష్యం లేకుండా చూసుకోవాలి. కొందరు మండపాల వద్ద రోజంతా మైకుల ద్వారా పాటలతో హోరెత్తిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టిన వారవుతారు. సాధ్యమైనంతవరకు శబ్ద కాలుష్యం లేకుండా చూసుకోవాలి. భక్తి గీతాలు, భక్తి సాంప్రదాయ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నవరాత్రులు, నిమజ్జన సమయంలో మద్యం తాగడం, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పనులు చేయకుండా ఉండాలి.

నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలి. వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. నిర్వాహకులు ఎలాంటి అసాంఘిక చర్యలకు తావివ్వకూడదు. నిమజ్జనం సమయాల్లో నిబంధనలు తప్పనిసరి పాటించాలి. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

-ప్రసన్న కుమార్, డీఎస్‌పీ, మెదక్


మరిన్ని వార్తలు