14-02-2026 12:00:00 AM
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తోట
పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం: నూతన కౌన్సిలర్లు
బిచ్కుంద, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 12 వార్డులకు గాను 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 వార్డుల కౌన్సిలర్లు గెలుపొందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచుకొని, టపాకాయలు కాల్చి గెలుపు సంబురాలు చేసుకున్నారు.
అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లకు భారీ పూల మాలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే తోట శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన బిచ్కుంద మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన ఈ గెలుపుతో తన భాద్యత రెట్టింపు అయ్యిందని అన్నారు. 1వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన సాధారణ కార్యకర్త గోనె గంగారాం భార్య గోనె హన్మవ్వ గెలుపు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో బిచ్కుంద మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తేల్చి చెప్పారు. ప్రతీ ఒక్క వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమా కనబరిచారు. గెలుపొందిన అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ, వార్డు అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు 1వ వార్డు గోనె హనుమవ్వ, 2వ వార్డు మారుతి పటేల్, 3వ వార్డు కార్తిక సంతోష్, 6వ వార్డు నౌషా నాయక్, 7వ వార్డు ముజాహిద్, 8వ వార్డు షేక్ గులాం సంధాని, 9వ వార్డు ధర్పల్లి గంగాధర్, 10వ వార్డు మఠం మానస, 11వ వార్డు భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, 12వ వార్డు సీమ షెట్కార్ లు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అందరి సహకారంతో పార్టీలకతీతంగా అందరితో కలిసి మెలిసి బిచ్కుంద పట్టణానికి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.