9 April, 2026 | 2:48 AM

రాజ్యాంగ స్ఫూర్తికి యూసీసీ విరుద్ధం

09-04-2026 12:00 AM

గుజరాత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మరోసారి దీనిపై చర్చ ప్రారంభమైంది. ఇది కేవలం చట్టం గురించిన చర్చ కాదు,- భారత రాజ్యాంగం ఎలా పనిచేయాలి, మత స్వేచ్ఛకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, అసలు సమానత్వం అంటే ఏమిటి? అనే మౌలిక ప్రశ్నలపై సాగుతున్న చర్చ ఇది. ‘ఒకే దేశం- ఒకే చట్టం’ అనే ఆకర్షణీయ నినాదం వెనుక ఉన్న వాస్తవాలను సమగ్రంగా పరిశీలిస్తే, ఈ అంశం ఎంత క్లిష్టమైనదో అర్థమవుతుంది. భారతదేశం ఏకరూప సమాజం కాదు.

ఇది భిన్న మతాలు, సంప్రదాయాలు, సంస్కృతులు కలగలిసిన దేశం. అందు కే వివాహం, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో ప్రతి మతానికి ప్రత్యేకంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇవి ఆయా సమాజాల జీవన విధానం, ఆచారాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. సూత్రప్రాయంగా ఇది సమానత్వం లక్ష్యంగా ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, అమలులో నిజంగా సమానత్వాన్ని సాధిస్తుందా, లేదా? అనే ప్రశ్న అనివార్యంగా వస్తోంది.

యూసీసీకి సం బంధించిన సూచన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ఉంది. కానీ, ఇది మౌలి క హక్కుల విభాగంలో కాదు; డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగం. అంటే, ఇది ప్రభుత్వానికి ఒక మార్గదర్శక సూత్రం మాత్రమే. దీన్ని తక్షణమే, బలవంతంగా అమలు చేయాల్సిన అవసరం లేదు. దీనికి విరుద్ధంగా, మత స్వేచ్ఛ (ఆర్టికల్స్ 25- మాత్రం మౌలిక హక్కుగా రాజ్యాంగం హామీ ఇస్తుంది. అయితే, రాజ్యాంగపరంగా మౌలిక హక్కులకే అత్యున్నత స్థానం ఉంటుంది.

అటువంటి పరిస్థితుల్లో యూసీసీ పేరుతో వ్యక్తిగత మత చట్టాలను పూర్తిగా పక్కనబెట్టడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది. మరో ఆసక్తికరమైన కోణం ఏమిటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లోనే మద్యపాన నిషేధం (ఆర్టికల్ 47) గురించి కూడా స్పష్టంగా ఉంది. కానీ, దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడంలేదు.

అలాగే వరకట్న నిషేధ చట్టం అమలు కావడం లేదు. మహిళలపై హింస, లింగ వివక్ష, సామాజిక అన్యాయం వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. సమాజ సంక్షేమానికి సంబంధించిన ఈ సమస్యలపై మరింత కఠినంగా, సమగ్రంగా సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉన్నప్పటికీ, ఒక్క యూసీసీపై చట్టం చేసే ప్రయత్నా లు చేయడం వెనుక ఉద్దేశాలపై అనుమానాలు తలెత్తడం సహజం.

గుజరాత్ యూసీసీ బిల్లులో గిరిజన సమాజాలకు మినహాయింపులు ఇవ్వవచ్చనే సూచనలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది నిజంగా ‘ఏకరూప’ చట్టమా అనే ప్రశ్న ముందుకొస్తోంది. గిరిజన సమాజాలకు మినహాయింపు లు ఇవ్వడం వారి ప్రత్యేక సంస్కృతికి సంబంధించిన రాజ్యాంగ హక్కులను కాపాడే దిశగా పూర్తి సమంజసమే. అయినప్పటికీ, ఒకవైపు సమానత్వం పేరు తో చట్టాన్ని ప్రవేశపెట్టడం, మరోవైపు కొన్ని వర్గాలను దాని పరిధి నుంచి తప్పించడం వైరుద్ధ్యాలను సూచిస్తోంది.

ఈ నేపథ్యంలో ముస్లిం సమాజం యూసీసీకి వ్యతిరేకంగా నిలబడటాన్ని రాజకీయ కోణంలోనే చూడటం సరైం ది కాదు. మొత్తంగా చూస్తే, గుజరాత్‌లో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టడం ఒక సాధారణ చట్టపరమైన చర్య కాదు. ఇది రాజ్యాంగస్ఫూర్తి, మత స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల మధ్య ఉన్న సమతుల్యతను పరీక్షించే సంఘటన. ఏ సంస్కరణ అయినా అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందగలగాలి. లేకపోతే, అది సమాజాన్ని విభజించే ప్రమాదం ఉంటుంది.

ఈ నేపథ్యంలో సమానత్వం పేరుతో తీసుకొస్తున్న ఈ మార్పులు నిజంగా సమాజాన్ని కలుపుతాయా? లేక ఇప్పటికే సున్నితమైన సమతుల్యతపై ఆధారపడిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే అందమైన భారతీయ భావనకు తూట్లు పొడిచి మరింత దూరం పెంచుతాయా? అన్నది చూడాలి. విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, మత స్వేచ్ఛను పక్కనబెట్టి తీసుకొచ్చే ఏకరూప చట్ట విధానం సమాజాన్ని కలపకపోగా, మరిన్ని విభజనలకు దారి తీసే ప్రమాదం ఉంది.

 యం.డి. ఉస్మాన్‌ఖాన్, సీనియర్ జర్నలిస్ట్