17 March, 2026 | 2:50 AM

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలది యుద్ధోన్మాదం

17-03-2026 12:20 AM
  1. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

బస్టాండ్ సెంటర్’లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా

మానవహారం చేపట్టి ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 16, (విజయక్రాంతి):  ఇర్పా అమెరికా, ఇజ్రాయెల్లది యుద్ధోన్మాదమని, ఈ చర్యలు ప్రపంచ శాంతిని తీవ్రంగా విచ్ఛిన్నం చేస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా విమర్శించారు. దేశవ్యాపిత నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం  సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండు సెంటర్లో  మానవహారం చేపట్టి ఖాళీ సీలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా కేంద్రం మౌనం వహించడం శోచనీయమని, అమెరికా ఒత్తిళ్లకు లొంగి కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని మండిపడ్డారు. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు నావికా విన్యాసాలకు వచ్చి వెళుతున్న ఇరాన్ నౌకను దేశ సముద్ర తీరంలో అమెరికా కూల్చివేస్తే కేంద్ర ప్రభుత్వం కనీసం ఖండించకపోవడం సిగ్గుచేటని, 160 మంది పిల్లలను బలి తీసుకున్నప్పుడు అమెరికా ఒత్తిడితో మాట్లాడకుండా మోకరిల్లడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని విమర్శించారు. 

పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.  కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, భూక్యా శ్రీనివాస్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు ఎం ధనలక్ష్మి, కె రత్నకుమారి, నిర్మల, గోపి కృష్ణ, పి ధనలక్ష్మి, ధర్మరాజు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఆకాంక్ష, వాడే రాములు, మంద నాగలక్ష్మి, సత్యనారాయణాచారి, విజయలక్ష్మి, యూసుఫ్, షాహీన్, కైసర్, అబ్బులు, రాకేష్, సింగిరాల రమేష్, లక్ష్మీనారాయణ, మండల రాజు తదితరులు పాల్గొన్నారు.