‘ఉపాధి’లో సౌకర్యాల లేమి!
- నీడ, నీటి వసతి కల్పించని అధికారులు
పని ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న కూలీలు
చేసిన పనికి కూలి పెంచాలని డిమాండ్
తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్న కూలీలు
సౌకర్యాల లేమితో ఇక్కట్లు
మెదక్, మార్చి 16(విజయ క్రాంతి) :జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎం డ తీవ్రత ఎంతలా ఉన్నా పొట్టకూటి కోసం కూలీలు పనులకు వెళ్లక తప్పదు. దీంతో తీవ్ర ఎండల్లో సైతం ఉపాధి హామీ పనులకు కూలీలు వెళ్తున్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కూలి పనులు చేస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో నిత్యం ఒక్కో మండలంలో 500 నుంచి 1000 మంది కూలీలు పనులు నిర్వహిస్తున్నారు.
గతంలో ఉపాధి కూలీకి రోజుకు రూ.297 చెల్లించగా, ప్రస్తుతం రూ.307 కు పెంచారు. కొలతలు కూడా తగ్గించారు. అయితే ఉపాధి కూలీలకు సరైన వసతుల కల్పించకపోవడంతో ఎండలోనే పనులు చేస్తున్నారు. పని ప్రదేశంలో నీడ, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు ఉంచాలనే నిబంధన అమలు కావడం లేదు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న చోట అధికారులు కూలీలకు వసతులు కల్పించాలి.
ప్రతీ గ్రామంలో కనీసంగా 300 మందికిపైగా కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలకు అనుగుణంగా తాగునీటి సౌకర్యం కల్పించాలి. అ యితే ఫీల్ అసిస్టెంట్లు ఒకటి, రెండు కవర్లతో నీడ కల్పిస్తున్నారు. అవి సరిపోకపోవడంతో కూలీలు చెట్ల నీడలో సేద తీరుతున్నారు. పనికి వెళ్లే సమయంలో కూలీలే నీటి బాటిల్ తీసుకెళ్తున్నారు.
పని ప్రాంతాల్లో తాగునీరు అందుబాటులో లేకపోవడంతో దాహంతో ఇబ్బంది పడుతున్నారు. కూలీలు డీహైడ్రేషన్కు గురవ్వకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడంలేదు. కూలీలు ఎక్కువగా పని చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఇది కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో అప్రమత్తంగా లేకపోతే కూలీలకు ఆరోగ్య సమస్య లు తప్పవు. ప్రతీరోజు ఉదయం 8 గంటలకు కూలీలు పనులకు వస్తుండగా, 11 గంటలకు హాజరు వేస్తున్నారు.
తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు హాజరు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు సేద తీరడానికి వారికి సరైనా నీడ, తాగునీరు అందుబాటులో ఉండడంలేదు. ఇటీవల ప్రభుత్వం నూతన సాఫ్ట్వేర్ను రూపొందించింది. సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో కూలీలు చాలా సేపు పనిచేసే ప్రదేశాల్లోనే వేచి ఉంటున్నారు. కూలీలకు వేతనాలు వారం రోజుల్లోగా చెల్లించాల్సి ఉండగా, 15 రోజుల వరకు డబ్బు అందడం లేదు. నేరుగా బ్యాంకు ఖాతాలో లేదా పోస్టల్ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ప్రస్తుతం కూలీలకు రెండు నెలల నుంచి డబ్బు చెల్లింపులు లేవు.
పనికి రాకున్నా వచ్చినట్టు హాజరు...
ఉపాధిహామీ పథకం కొంత మందికి ఫీల్ అసిస్టెంట్లకు వరంగా మారింది. గ్రామాల్లో వారికి నమ్మకస్థులైన పేర్లను రాయడం, వారు పనికి రాకు న్నా, వచ్చినట్టు హాజరు వేస్తున్నారు. కూలీలకు వచ్చే డబ్బులో రూ.100 ఇచ్చి మిగతా మొత్తాన్ని ఫీల్డ్‌అసిస్టెంట్లు తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో గతంలో నిర్వహించిన ఉపాధిహామీ సామాజిక తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూ శాయి. అయినా ఫిల్ అసిస్టెంట్ల తీరు మార డం లేదు. వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు జీవనం సాగిస్తున్నారు.
వ్యవసాయ సీజన్ల సమయంలోనూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేందుకు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉండగా, అది నెరవేరడం లేదు. వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అటు కూలీలతోపాటు, రైతులకు కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో చేపడుతున్న ఉపాధి హామీ పనుల్లో వసతులు, సౌకర్యాల లేమి స్పష్టంగా కానవస్తోంది.
పని ప్రదేశంలో కూలీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, వసతులు ఎక్కడా కన్పించడం లేదు. దీంతో కూ లీలు ఎండలోనే ఇబ్బందులు పడుతూ పనులను ముగించేస్తున్నారు. రోజు రోజుకు ఎం డలు పెరిగిపోతుండడంతో కూలీలు ఉద యం ఏడు నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పనులు చేసి ఇళ్లకు వెళ్తున్నారు. జిల్లాలో ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ తీవ్రత కన్పిస్తుండడంతో కూలీలు ఎం డ తాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు.
జి ల్లాలో 492 గ్రామ పంచాయతీలకు గాను 1, 60,000 జాబ్కార్డులు ఉండగా, 3.21లక్షల మంది కూలీలు ఉన్నారు. 2025- 26 పనిదినాల లక్ష్యం 25.27లక్షలు కాగా, పూర్తి చేసి నవి 20.10 లక్షలు. వంద రోజులు పూర్తయి న కుటుంబాలు 185, కూలీలకు చెల్లించిన డబ్బులు రూ.50.37కోట్లు, డబ్బులు పొందిన కూలీలు 70వేల మంది ఉన్నారు.
నిబంధనలు కఠినం.. వసతులు శూన్యం
నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా పని ప్రదేశంలో కూలీల ఫొటోలు తీసి పోర్టల్లో నమోదు చేస్తుండగా ఎలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. దీనికితోడు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కూలి రేటును రూ.10 కి పెంచారు. కూలీలకు కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమౌతున్నారు. పని ప్రదేశంలో నీళ్లు, మెడికల్ కిట్లు, టెంట్ తదితర వసతులు కల్పించాలి.
కానీ ఐదేళ్లుగా ప్రభుత్వం వీటి ఊసే ఎత్తడం లేదు. వేసవిలో వ్యవసాయ పనులు అంతంతగానే ఉండడంతో ఉపాధి పనులు చేసేందుకు కూలీలు వెళ్తుం టారు. చెరువుల్లో పూడిక తీయడం, కాల్వలు, కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం వంటివి చేయిస్తున్నారు.




