జీవ ఎరువుల వాడకమే ప్రత్యామ్నాయం
భారతదేశం ఆహార భద్రతలో నేడు స్వయంసమృద్ధి సాధించింది. కానీ, పంటలు పండించడానికి అవసరమైన ఎరువుల కోసం మాత్రం తీవ్రమైన దిగుమతి సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇటీవల పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు మన దేశ ఎరువుల భద్రతను హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు మన ఎరువుల సరఫరా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టం చేశాయి. భారత ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం కావాలి. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రైతులకు అండగా నిలవాలి.
జీవ ఎరువుల మార్గమే ఇప్పుడున్న పరిస్థితులకు పత్యామ్నాయం. అది పర్యావరణ ఆవశ్యకతే కాదు.. రైతుల సంక్షేమంలో కీలకమైన అంశం. ఆహార ఉత్పత్తి కోసం ఇతర దేశాలపై ఆధారపడటం ఎప్పుడూ ప్రమాదకరమే. భౌగోళిక రాజకీయంగా అస్థిరంగా ఉండే ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవడం మరింత జటిలం. చమురు విషయంలో మనకు సరిపోను నిల్వలు ఉన్నాయి. కానీ, నత్రజని సంబంధిత ఎరువుల విషయంలో అలాంటి రక్షణ లేదు. ప్రస్తుతం భారత్ తన యూరియా అవసరాల్లో దాదాపు మూడు వంతులు ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నది.
2025 నాటికి ఎరువుల సబ్సిడీ బిల్లు రూ.1.86 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఇది ప్రభుత్వ మొత్తం సబ్సిడీ వ్యయంలో 40 శాతానికి పైగా ఉంటుంది. సరఫరా మార్గాల్లో చిన్న అంతరాయం కలిగినా షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఇది నేరుగా సబ్సిడీ భారాన్ని పెంచి ఖరీఫ్ సీజన్ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్థిక అంశాలే కాకుండా రసాయన ఎరువుల అతి వినియోగం వల్ల మన నేలల స్వభావం పూర్తిగా దెబ్బతిన్నది. శాస్త్రీయంగా ఉండాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం నిష్పత్తి 4:2:1 కి బదులుగా ఆందోళనకరంగా 10.9:4.4:1కి చేరింది.
రసాయన ఎరువుల వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. నేల నిస్సారమవుతోంది. మనం వాడే ఎరువుల్లో సగం కంటే తక్కువ భాగమే మొక్కలకు అందుతోంది. మిగిలినది గాలిలోకి ఆవిరవుతోంది లేదా భూగర్భ జలాల్లో చేరి పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. ఈ సంక్లిష్ట సమస్యకు జీవ ఎరువులు స్పష్టమైన పరిష్కారాన్ని చూపుతున్నాయి. ఇవి నేలలో నత్రజనిని స్థిరీకరిస్తాయి. భాస్వరాన్ని కరిగిస్తాయి.
నేల జీవశాస్త్రాన్ని మెరుగుపరిచే సూక్ష్మజీవుల ద్వారా ఇవి తయారవుతాయి. ఇవి దేశీయంగా తయారు కావడమే కాకుండా రసాయన ఎరువుల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. సిక్కిం రాష్ట్రం వంద శాతం సేంద్రియ రాష్ట్రంగా మారడం ఒక గొప్ప నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం ఈ మార్పు సాధ్యమని నిరూపిస్తోంది. ప్రభుత్వం రసాయన ఎరువులకు ఇచ్చే భారీ సబ్సిడీల తరహాలోనే జీవ ఎరువులకు కూడా ప్రోత్సాహక పథకాలను ప్రకటించాలి. సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తే రైతులకు నాణ్యమైన ఎరువులను ఎంచుకునే స్వేచ్ఛ దక్కుతుంది.
నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద ఏర్పాటు చేస్తున్న పది వేల బయో-ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు ఈ విప్లవానికి వెన్నెముకగా నిలవాలి. ప్రైవేట్ కంపెనీలను కూడా ఈ రంగంలో భాగస్వాములను చేయాలి. వారు కేవలం అమ్మకాలకే కాకుండా పంట దిగుబడి ఫలితాలకు కూడా బాధ్యత వహించేలా చూడాలి. రసాయన ఎరువుల నుంచి జీవ ఎరువుల వైపు మళ్లడం రాత్రికి రాత్రే సాధ్యం కాకపోవచ్చు. ఇవి తక్షణం పూర్తి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. గుమతి భారాన్ని తగ్గించుకునేందుకు, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవ మార్గాన్ని అనుసరించడం నేటి అవసరం.
వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్, సెల్: 98485 59863




