ధరలు పిరం.. దంచుకో మిరం!
మండిపోతున్న కూరగాయల ధరలు
ప్రకృతి వైపరీత్యాలతో రేట్లు పైపైకి
ఏది కొందామన్నా కిలో 60కి పైనే
సామాన్యుల భోజనానికి తిప్పలు
తగ్గిన
దిగుబడితో పెరిగిన రేట్లు
ఒకవైపు మండుతున్న ఎండలు, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలతో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. అకాల వర్షాలు కూరగాయల తోటలను దెబ్బతీశాయి. వడగండ్ల వానలతో తోటల్లోని ఆకుకూరలకు చిల్లులుపడి పంటను నాశనం చేశాయి. పాలకూర, తోటకూర, గంగవాయిలీ, చుక్కకూర లాంటివి సాగు చేస్తున్నారు.దీంతో కూరగాయల దిగుబడి తగ్గి ధరలపై ప్రభావం పడింది. అవసరానికి సరిపడ దిగుబడి లేకపోవడంతో వ్యాపారులు రేట్లు పెంచేశారు. గతంలో రూ. 10, 20లకు పావుకిలో, అరకిలో వచ్చే కూరగాయలు ప్రస్తుతం రూ. 30,40లకు చేరింది. ఆకుకూరలు కూడా కిలో 80 వరకు పలుకుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మిర్చి కిలో రూ. 120కి చేరింది. టమాట కిలో రూ. 60, వంకాయ 80, క్యాప్సికం, కాకరకాయ 80, బెండకాయ 60, అలసంద 80, గోరుచిక్కుడు 80, క్యాబేజీ 60... ఇలా అన్ని కూరగాయలు మండిపడుతూ సామాన్యులను బెదరగొడుతున్నాయి.
ఏం కొనేటట్టు లేదు
ధరలు సూత్తే ఏం కొనేటట్టు లేదు. గత వారం సంది రేట్లు బాగ పెరిగినయ్. ఏ కూర అడిగినా 60కి పైనే చెప్తాండ్లు. వంద రూపాయలు తీసుకుపోతే రెండు రకాలు కూడా వస్తలేవు. ధరలను చూసి పచ్చళ్లు, కారంతోనే కాలం వెల్లదీస్తానం.
గుండు గున్నమ్మ కూలీ, మహాముత్తారం
కూరగాయల ముచ్చటే లేదు
పది పదిహేను రోజుల సంది కూరగాయలు కొనడం మర్చిపోయినం. 15 రోజుల క్రితం వరకు రేట్లు అగ్గువే ఉండే. ఒక్కసారిగా డబుల్ అయినయ్. కూలి పని చేసుకుని బతికెటోళ్లం. రోజు వంద పెట్టి కూరగాయలు కొని తినే పరిస్థితులు లేవు. ధరలు తగ్గే దాక కారం మెతుకులతోనే గడుపుతం.
అజ్మీర విమల వ్యవసాయ కూలీ రెడ్డిపల్లి






