హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ప్రకటించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
జిల్లా సాధన జేఏసీ డిమాండ్
హుజూరాబాద్, 31(విజయక్రాంతి) : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ప్రకటిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జిల్లా సాధన జేఏసీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ భీమోజు సదానందం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం హుజూరాబాద్ పార్కులో జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ జిల్లాగా ఏర్పడడానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని, చుట్టు పక్కల 14 మండలాలను కలుపుకొని, మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు పేరుతో జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు జమ్మికుంటలో జరిగిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేయాలని కోరారు. జిల్లాగా ప్రకటించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేల్పుల రత్నం, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకట్రాజం, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు తాటిపెల్లి రాజన్న, ఆలేటి రవీందర్, కొడిగూటి మొగిలయ్య, క్యాస రమేష్, డాక్టర్ తడికమల్ల శేఖర్, వేల్పుల ప్రభాకర్, రామ్ సారయ్య, ఇల్లందుల సమ్మయ్య, రామ్ రాజేశ్వరి, మార్త రవీందర్, బత్తుల రాజలింగం, సందేల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.






