విజయుడు!
టీవీకేకు వీసీకే మద్దతు
మేమూ సై అన్న ఐయూఎంఎల్
విజయ్‌కి లైన్ క్లియర్
120కి చేరిన మెజార్టీ ఫిగర్
- గవర్నర్‌కు మద్దతిచ్చిన పార్టీల లేఖల సమర్పణ
- సంతృప్తి చెందిన గవర్నర్ అర్లేకర్
- 13లోగా బల నిరూపణ చేసుకోవాలని సూచన
- నేడు ఉదయం 10 గం.కు ప్రమాణ స్వీకారోత్సవం
- వేదిక కానున్న చెన్నైలోని నెహ్రూ స్టేడియం
చెన్నై, మే 9 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గత ఐదురోజులుగా అనేక మలుపు తిరిగిన తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి శనివారం తెరపడింది. అత్యధిక స్థానాలు సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలుపగా, శనివారం వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చాయి. దీంతో తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఆదివారం కొలువు తీరనుంది.
పూర్తి మెజార్టీతో లోక్‌భవన్‌కు వెళ్లిన విజయ్‌కి మొదట అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో తిరిగొచ్చారు. తర్వాత కేరళ పర్యటను గవర్నర్ రద్దు చేసుకుని విజయ్‌ని ఆహానించారు. దీంతో విజయ్ మళ్లీ 6:30 గంటలకు లోక్‌భవన్‌కు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ లైన్‌క్లియర్ చేశారు. అయితే ఈనెల 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ను నియమిస్తూ లోక్‌భవన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో టీవీకే చీఫ్ విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగడంతో ప్రజలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.
తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినా, 107 స్థానాల్లో గెలుపొందినా మెజార్టీ సంఖ్య దక్కలేదు. దీంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గత నాలుగు రోజులుగా గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే మొదట కాంగ్రెస్, వామపక్షాలు టీవీకేకు మద్దతు ఇచ్చాయి. తాజాగా శనివారం వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇవ్వడంతో టీవీకేకు మెజార్టీ సంఖ్య 120కి చేరింది.
దీంతో గవర్నర్‌ను శనివారం విజయ్ కలిసి తమకు మద్దతిచ్చిన పార్టీల లేఖలను అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరారు. మెజార్టీ మార్క్ (118)కు చేరుకోవడంతో గవర్నర్ అంగీకరించారు. మే 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తదుపరి మంత్రి వర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. ఆ పార్టీకి చెందిన ఐదుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తున్నట్లు తెలిసింది.
మంత్రివర్గంలో సెంగోట్టియన్, ఆధవ్ అర్జున, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్మోహన్‌కు అవకాశం కల్పించనున్నారు. మరోవైపు డీఎంకే తో పాటు కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలన్నీ విజయ్ బాట పట్టినా అధినేత స్టాలిన్ మాత్రం వారికి కృతజ్ఞతలు తెలిపా రు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమను సంప్రదించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మిగతా పార్టీలను విజయ్‌కు మద్దతుగా పంపి, రేపు ప్రభుత్వంలో తమ సన్ని హితులు ఉండేలా చూసుకోవాలని స్టాలిన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
క్యాబినెట్ పదవులు వద్దు : వీసీకే
ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతు ఇచ్చిన వీసీకే.. క్యాబినెట్ బెర్త్‌లు మాత్రం వద్దని పేర్కొంది. తాము ప్రభుత్వంలో చేరబోమని, వెలుపలి నుంచే మద్దతు ఇస్తా మని, భవిష్యత్‌లో ప్రభుత్వంలో భాగం అవుతామా లేదా అన్నది చెప్పలేమని స్పష్టం చేసింది.
రాష్ట్రపతి పాలనను నివారించేందుకు, ప్రజల తీర్పు నెరవేరడానికి ప్రభుత్వ ఏర్పాటులో భాగం అవుతున్నామని ఆ వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళవన్ మీడియా కు వెల్లడించారు. తాము ఇప్పటికీ డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే ఉన్నామని వీసీకే, ఐయూఎంఎల్ పేర్కొనడం గమనా ర్హం. అయితే వామపక్షాలు కూడా బయటి నుంచే మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
గవర్నర్ ఆహ్వానంలో ట్విస్టులు
తమిలనాడులో ట్విస్టుల మీద ట్విస్టులతో టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ ఆహ్వానం లభించింది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ సంఖ్య దక్కిందని గవర్నర్ కార్యాలయానికి విజయ్ వెళ్లగా.. ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు చేయలేదు. దాంతో లోక్‌భవన్ నుం చి విజయ్ టీవీకే ఆఫీస్‌కు తిరిగి వెళ్లారు. అయితే గవర్నర్ షెడ్యూల్ ప్రకారం.. తొలుత అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. కానీ తర్వాత గవర్నర్ తన కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో సాయంత్రం 6:30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో విజయ్ మళ్లీ లోక్‌భవన్‌కు వచ్చారు.
120కి చేరిన మెజార్టీ
విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై వీసీకే శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ఆ పార్టీ అంగీకరించడంతో తమిళనాడులో క్షణక్షణం మలుపులు తిరుగుతున్న రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేల మద్దతుతో 118 ’మ్యాజిక్ నంబర్’ను చేరుకుని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో వడానికి వీలైంది.
దీనిపై ప్రకటన చేసిన వీసీకే.. తమ మద్దతు లేఖను టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ అర్జునకు అందజేసింది. అంతకు ముందు టీవీకేతో పొత్తుపై నిర్ణ యం తీసుకునే అధికారం అధినేతకు వీసీకే కార్యనిర్వాహక కమిటీ అప్పగించింది. అలాగే, ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇస్తున్న ట్టు తెలిపింది. ప్రస్తుతం టీవీకేకు 107 మం ది, కాంగ్రెస్ 5, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2, ఐయూఎంఎల్ 2 కలిపి మొత్తం మెజార్టీ సభ్యుల సంఖ్య 120కి చేరింది.






