calender_icon.png 17 July, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూగబోయిన బీసీ ఉద్యమ గళం

17-07-2025 01:53:00 AM

  1. అనారోగ్యంతో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్  కన్నుమూత

జనగామ వైద్య కళాశాలకు ప్రభంజన్ పార్థీవదేహం అప్పగింత

కేసీఆర్‌తో సహా ప్రముఖుల నివాళి

వరంగల్(జనగామ)/హైదరాబాద్ సిటీ బ్యూరో,జూలై16(విజయక్రాంతి):  బీసీ ఉద్యమకారుడు, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ యాదవ్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉద యం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి బీసీ ఉద్యమానికి, తెలంగాణ మేధో సమాజానికి తీరని లోటని పలువురు నేతలు, మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఒక సామాన్య గొర్రెల కాపరి యాదవ కుటుంబంలో యాదనాల కొమరమ్మ సోమయ్య దంపతులకు ప్రథమ సంతానంగా ప్రభంజన్ యాదవ్  జన్మించారు. మొట్టమొదటి సారిగా గ్రామం నుంచి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) సాధించి ఆల్ ఇండియా రేడియోలో విధులు నిర్వహించారు. జాతీయ ప్లానింగ్ కమిషన్‌లో పీఆర్ ఓగా విధులు నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేశారు.

తెలంగాణలో పనిచేయాల న్న తపనతో  తెలంగాణ యూనివర్సిటీలో జర్నలి జం విభాగంలో పనిచేసి ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచే ప్రగతిశీల వామపక్ష ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. డోలు దెబ్బ, యాదవ ఇంటలెక్షన్ ఫోరం, సామాజిక తెలంగాణ జాక్ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేశారు. సత్యశోధక సామాజిక విద్యాపీఠం స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించారు.

గద్దర్‌తో పాటు జననాట్యమండలిపై తన ఎంఫీల్ థీసిస్ ప్రజెంట్ చేశారు. ఆయనకు భార్య డాక్టర్ రేఖ, కుమారులు విశ్వామి త్ర, సత్యశోధక్ ఉన్నారు.  ప్రభంజన్ పార్థీవ దేహాన్ని హైదరాబాద్  నుంచి పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన చివరి కోరిక మేరకు తన పార్థీవ దేహాన్ని జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి సమర్పించారు.

ఆయన మృతదేహానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, డాక్టర్ చెరుకు సుధాకర్, సీనియర్ పాత్రికేయులు కన్నా పరుశరాములు నివాళి అర్పిం చారు. ప్రొఫెసర్ ప్రభంజన్ మృతి బీసీలకు తీరని లోటని ప్రొఫెసర్ కంచ ఐలయ్య, డోలక్ యాదగిరి, తదితరులు అన్నారు. 

సామాజిక ఉద్యమకారుడిని కోల్పోయాం: కేసీఆర్

తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి ప్రొ.ప్రభంజన్ యాదవ్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్ట్ మేధావిగా, యాక్టివిస్ట్‌గా ప్రభంజన్ యాదవ్ చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత గొప్పదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అన్నారు.

ఆయన మరణంతో తెలంగాణ ఒక గొప్ప తాత్వికున్ని, సామాజిక ఉద్యమకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సామాజిక న్యాయం కోసం..

తెలంగాణ జనసేనను స్థాపించి సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా అహర్నిశలు పరితపించారు. ప్రభంజన్ మండల్ టీవీని స్థాపించి సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఉద్యమాలు చివరి వరకు కొనసాగించారు. బహుజన మీడియా, ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ లాంటి ఎన్నో పుస్తకాలను రచించారు.

వెనుకబడిన కులాలను ఒకే వేదికపైకి తెచ్చి సామాజిక న్యాయ ఉద్యమాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. బీసీ యువతలో చైతన్యం నింపేందుకు రాష్ర్టవ్యాప్తంగా పర్యటించారు.  దోపిడీకి గురవుతున్న కులాలకు రాజకీయ సాధికారత దక్కాలని నిరంతరం తపించారు.