17-07-2025 01:52:49 AM
- నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కుంట్లూర్, నాగోల్ సాయినగర్ గుడిసెల..
- అగ్ని ప్రమాదాల ఘటనకు, హత్యకు లింక్?
- పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన మలక్ పేట పోలీసులు
ఎల్బీనగర్, జులై 16 : సీపీఐ నాయకుడు చందూ నాయక్ హత్య కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. మలక్పేట లోని శాలివాహన నగర్ కాలనీ పార్కులో సోమవారం జరిగిన కాల్పుల కేసులో పురోగతి సాధించారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు తెలిపారు.
చందూ నాయక్ రాథోడ్ హత్యకు పార్టీలోని అంతర్గత, వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రాజేశ్, చందూ నాయక్ మధ్య పేదల గుడిసెలు, భూ వ్యవహారంలో వివాదాలు సాగుతున్నట్టు ఆధారాలు లభించా యి. ఈ భూ వివాదాలు కుంట్లూర్ పరిధిలో చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా, వివాహేతర సంబంధం కారణమేమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజకీయ కోణంలో దర్యాప్తు..
చందూ నాయక్ హత్యలో రాజకీయ కోణం ఉందా..? అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు స్థానికంగా పోలీసులు అలర్ట్ గా వ్యవహరిస్తున్నారు.
వివాహేతర సంబంధం కోణంలోనూ
చందూ నాయక్ కాల్పుల కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చారు. చందూపై మొత్తం ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారని, పోస్టుమార్టంలో 5 బుల్లెట్లు తొలిగించారు. ఘటనా స్థలంలో మరో మూడు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో అనుమానితులు రాజేశ్, యాదగిరి, మున్నా, భాషా, రాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రాజేశ్ ప్లాన్ తోనే సీపీఐ నాయకులు కుంట్లూర్ పరిధిలో వేలాది గుడిసెలు వేశారు.
గుంటూరు గుడిసెల వ్యవహారంలో పరస్పర కేసులు
ఈ ఏడాది జరిగిన కుంట్లూరు రావి నారాయణరెడ్డి కాలనీ గుడిసెల్లో, నాగోల్ లోని సాయినగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనల సమయంలో రాజేశ్, చందు నాయక్ వర్గం పరస్పర కేసులు పెట్టుకున్నారు. చందు నాయక్ అనుచరులే గుడిసెలను తగలబెట్టారని ఆరోపణలు కూడా వచ్చాయి.
ఈ విషయంలో ఇప్పటికీ చనిపోయిన చందు నాయక్ పై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చందూ నాయక్ వ్యతిరేక వర్గం రాజేశ్, ప్రశాంత్, శివ, ఏడుకొండలు, సుధాకర్, రాయుడు, మున్నా, సీపీఐ నాయకులు రవీంద్రచారి, యాదిరెడ్డి పేర్లను పోలీసులు ఎఫ్‌ఆర్‌ఐలో చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
హత్యలో పాల్గొన్నది నలుగురు
ప్రాథమిక దర్యాప్తులో చందూ నాయక్ ను నలుగురు హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. మరో ఐదుగురు వారికి సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. కాల్పుల ఘటన అనంతరం నిందితులంతా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం హత్యకు సహకరించిన నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. మిగిలిన ఐదుగురి కోసం 10 ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు.