ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్పెషల్ ఆఫీసర్ చెన్నయ్య
వనపర్తి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పెషల్ ఆఫీసర్ చెన్నయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ సమక్షంలో తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లతో ప్రత్యేక అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా ఓటర్ మ్యాపింగ్ పురోగతిని పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్, జిల్లాలో ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న కారణాలపై ఆరా తీశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఓటర్ మ్యాపింగ్ 70 శాతం మాత్రమే పూర్తయిందని పేర్కొంటూ, అన్ని మండలాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






