ఓట్లు మావైతే అధికారం మీదా?
పాపని నాగరాజు :
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యవసరంగా వినిపించాల్సిన ప్రశ్న ఒకటే. ఓట్లు బహుజన సమాజం నుంచి వస్తుంటే, అధికారం మాత్రం ఎందుకు కొద్దిమందికే పరిమితం అవుతోం ది? ఇది కేవలం ఎన్నికల లెక్కల ప్రశ్న కాదు. ఇది అధికార నిర్మాణం గురించి, సామాజిక న్యాయం గురించి, ప్రజాస్వామ్య అసలు స్వరూపం గురించి. తెలంగాణ సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే-2024 నాలుగు సంపుటాలు విడుదలైన తర్వాత ఒక నిర్లక్ష్యం చేయలేని సత్యం మన ముందుకొచ్చింది.
రాష్ట్రంలో ముస్లింలు కాని బీసీలు 1,64,09,179 మంది కాగా, అది మొత్తం జనాభాలో 46.25 శాతం. ఎస్టీలు 37,05,929 మంది కాగా, వారి వాటా 10.45 శాతం. ఈ రెండు వర్గాలు కలిపి రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్నప్పటికీ, రాజకీయ అధికార నిర్మాణంలో వారి వాటా అదే స్థాయిలో ఉందా? అన్న ప్రశ్న తప్పనిసరిగా ముందుకువస్తుంది.
బీసీల్లో గొల్ల యాదవ్‌లు 20,17,237 (5.68%), ముదిరాజ్‌లు 26,36,641 (7.43%), గౌడ్‌లు 16,27,734(4.58%), కురుమలు 7,94,860 (2.24%) ఉన్నా రు. బీసీ ఏ వర్గంలో రజక చాకలి 9,94,327 మంది, వడ్డెర 6,43,178 మం ది ఉన్నారు. ఎస్టీల్లో లంబాడా బంజారా లు 24,02,836 మందితో ఎస్టీ జనాభాలో 64.84 శాతం వాటా కలిగి ఉన్నా రు. ఈ అసమానత కొత్తది కాదు. 1952 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఒకే నమూనా పునరావతమవుతూ వచ్చింది.
ఎన్నికల సమయంలో బహుజన సమాజం ఓట్లు నిర్ణయాత్మకమవుతాయి. కానీ, అధికార పంపిణీ దశకు వచ్చేసరికి ప్రాతినిధ్యం క్షీణిస్తుంది. అసలు ప్రశ్న ఎమ్మెల్యేలు ఎందరు అన్నది కాదు.. ఎమ్మెల్యేకి నిర్ణయాధికారం ఎంత దక్కింది అన్నది. మంత్రి పదవి వచ్చిందా, లేదా అన్నది మాత్రమే కాదు.. వచ్చినా ఏ శాఖ వచ్చింది? విధానాలను ప్రభావితం చేసే శక్తి ఉందా? బడ్జెట్ దిశను ప్రభావితం చేసే స్థానం దక్కిందా?
ఈ అసమానత శాసనసభ ప్రాతినిధ్యంతో ముగియదు. మంత్రివర్గ నిర్మాణం లో మరింత స్పష్టంగా బయటపడుతుంది. బీఆర్‌ఎస్ మొదటి మంత్రివర్గంలో 2014 నుంచి 2018 వరకు మొత్తం 18 మంది మంత్రుల్లో బీసీలు నలుగురే, అంటే సు మారు 22 శాతం. బీఆర్‌ఎస్ రెండో మం త్రివర్గంలో 18 మంది మంత్రుల్లో బీసీలు ఐదుగురే, అంటే సుమారు 28 శాతం. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రివర్గంలో 12 మం ది మంత్రుల్లో బీసీలు ముగ్గురే ఉన్నారు. అంటే దాదాపు 25 శాతం. రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతం ఉండగా మంత్రివర్గంలో వారి వాటా 22 నుంచి 28 శాతం మధ్యే పరిమితం కావడం గ ణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
బీసీ మంత్రులకు వచ్చిన శాఖలు పరిశీలిస్తే ఎక్కువగా బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, ఎక్సైజ్, పశుసంవర్ధక శాఖలే దక్కాయి. కానీ ఆర్థిక, హోం, నీటిపారుదల, సమాచార సాంకేతికత వంటి రాష్ట్ర విధాన దిశను నిర్ణయించే కీలక శాఖలు మాత్రం ఇతర ఆధిపత్య వర్గాల చేతుల్లోనే కేంద్రీకతమయ్యాయి. గొల్ల కురుమ సమాజాల పరిస్థితి మరింత ఆందోళనకరం.
అయితే, కొంతమంది బీసీ నాయకులు ఎదగడం అంటే మొత్తం బీసీ సమాజం సాధికారత పొందిందని భావించడం కూడా ప్రమాదకరమైన భ్రమ. వ్యక్తిగత ఎదుగుదల సామూహిక విముక్తికి సమా నం కాదు. ప్రజల ఓట్లతో కొందరు నా యకులు పైకి వచ్చి, చివరకు అదే పాత అధికార నిర్మాణంలో కలిసిపోతే దాన్ని సామాజిక న్యాయం అనలేం.
ఇది బీసీలకు మాత్రమే పరిమితం కాదు. గొల్ల కురుమ, బీసీ ఏ వర్గాలు, ఎస్టీ సమూహాలు, బీసీ మహిళలు అన్నింటికీ వర్తిస్తుంది. ప్రత్యేకంగా బీసీ మహిళల పరిస్థితి మరింత సంక్లిష్టం. కులం, వర్గం, లింగం అనే మూడు గుదిబండలను ఎదుర్కొంటూ కూడా అధికార నిర్మాణంలో అ త్యల్ప ప్రాతినిధ్యంతో నిలవాల్సి వస్తోంది.
మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, మంత్రివర్గ విస్తరణలో ఆ మార్పును ఆచరణలో చూపించాల్సిన బాధ్యతను మోస్తోంది. గొల్ల కురుమ సమాజాలకు, బీసీ ఏ వర్గాలకు, ఎస్టీ సవహాలకు, బీసీ మహిళలకు జనాభా నిష్పత్తికి అనుగుణమైన మంత్రి పదవులు ఇవ్వడమే సరిపోదు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు, విశ్వవిద్యాలయాల కీలక బాధ్యతలు, విధాన నిర్ణయ సంస్థలు అన్నీ కలిపిన మొత్తం అధికార నిర్మాణంలో వారి వాటా ఎంత ఉందన్నదే అసలు కొలమానం కావాలి. బీఆర్‌ఎస్ పాలనలో ఏర్పడిన అధికార కేంద్రీకరణను కాంగ్రెస్ కూడా కొ నసాగిస్తే పాలకులు మారినంత మాత్రాన వ్యవస్థ మారిందని ఎలా చెప్పగలం?
ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన అంశం అధికార కేంద్రీకరణ. అన్ని కీలక నిర్ణయాలు ఒకే కేంద్రం చుట్టూ తిరిగితే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు? సమర్థులైన ప్రజాప్రతి నిధులు లేరా? ఉంటే వారికి బాధ్యతతో పాటు నిర్ణయాధికారం ఎందుకు ఇవ్వడం లేదు? ఇది వ్యక్తుల అవమానం మాత్రమే కాదు. వారిని ఎన్నుకున్న ప్రజలకు కూడా అవమానమే.
తెలంగాణలో బీసీలకు, గొల్ల కురుమ సమాజాలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు, బీసీ ఏ వర్గాలకు, ఎస్టీలకు ఇప్పుడు అత్యవసరం రాజకీయ చైతన్యం. ఓట్లు మాత్రమే తమవిగా ఉండి అధికారం ఇతరుల చేతుల్లో ఉండే పరిస్థితిని సహజంగా స్వీకరించే కాలం ముగియాలి. సంక్షేమం సరిపోదు. ఉపశమనం సరిపోదు. అధికార భాగస్వామ్యమే నిర్మాణాత్మక మార్పుకు పునాది. అధికారం ఎవరి చేతిలో ఉందన్నది ముఖ్యం.
ఓట్లు మావి అయితే అధికారం కూడా మాదే కావాలి అనే రాజకీయ అవగాహన పెరగాలి. అడుక్కుని దక్కే పదవి తాత్కాలికం. సంఘటిత చైతన్యంతో సాధించిన అధికారం చారిత్రక మార్పునకు పునాది. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఇదే. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అయితే, అధికార వాటా సామాజిక న్యాయానికి అసలు ప్రమాణం.
సత్యశోధక మహాసభ ప్రతినిధి






