ప్రజాస్వామ్యంలో చీకటిరోజు
రామకిష్టయ్య సంగనభట్ల :
భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే స్వాతంత్య్రం వచ్చిన 28 సంవత్సరాలకే దేశ ప్రజలు తమ రాజ్యాంగబద్ధ హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 1975 జూన్ 25 అర్ధరాత్రి ప్రకటించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టంగా నిలిచింది. ఎమర్జెన్సీ ప్రకటనకు రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమ య్యాయి.
1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి రాజ్ నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న సంచలన తీర్పు వెలువరించింది. అధికార దుర్వినియోగం జరిగిందని పేర్కొంటూ ఆమె ఎన్నికను రద్దు చేసింది. ఆ తీర్పు రాజకీయంగా తీవ్ర సంక్షోభానికి దారితీసింది. ఇదే సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్గత అశాంతి నెలకొందని పేర్కొంటూ భారత రాజ్యాంగంలోని 352వ అధికరణం కింద రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రారంభమయ్యాయి. జయప్రకాశ్ నారాయణ్, మోరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, చరణ్‌సింగ్ వంటి ప్రముఖ నాయకులను నిర్బంధించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రాథమికమైన భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి పౌరహక్కులు ఆచరణలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ కాలంలో అత్యంత తీవ్రమైన దెబ్బ పత్రికా స్వేచ్ఛకు తగిలింది. దేశవ్యాప్తంగా పత్రికలపై ముందస్తు సెన్సార్ విధానం అమలులోకి వచ్చింది. తెలుగు భాషలో హైదరాబాద్ నుంచి వెలువడిన ‘జాగృతి’, ‘సజన’, రాజమండ్రి నుంచి వచ్చిన ‘ప్రజా సమస్యలు’ వంటి పత్రికలు ఆంక్షలను ఎదుర్కొన్నాయి.
దేశంలో ఏకైక కార్టూన్ పత్రికగా గుర్తింపు పొందిన ‘శంకర్ వీక్లీ’ కూడా మూతపడాల్సి వచ్చింది. పత్రికా స్వేచ్ఛను అణచివేసినప్పటికీ ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలు ఆవిర్భవించాయి. దేశవ్యాప్తంగా అజ్ఞాత పత్రికలు, కరపత్రాలు, చిన్న పుస్తకాలు రహస్యంగా ముద్రించి ప్రజల్లో పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘వందేమాతరం’, ‘గర్జన’, ‘అంతర్వాణి’, ‘ప్రజావాణి’, ‘జనవాణి’ వంటి అజ్ఞాత పత్రికలు ప్రజాస్వామ్య పరిరక్షణకు వేదికలుగా నిలిచాయి.
ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ప్రభావం గణనీయంగా పెరిగింది. ఆయన ప్రతిపాదించిన ఐదు అంశాల కార్యక్రమంలో భాగంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను బలవంతంగా నిర్వహించారు. అయితే భయభ్రాంతుల మధ్య కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిఘటన ఆగలేదు. జయప్రకాశ్ నారాయణ్ పిలుపుతో వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాలు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అజ్ఞాత ఉద్యమాన్ని కొనసాగించాయి.
21 నెలలపాటు కొనసాగిన ఎమర్జెన్సీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా పెరిగింది. చివరకు 1977 జనవరిలో లోక్‌సభ ఎన్నికలను ప్రకటించాల్సి వచ్చింది. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారు. ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో పరాజయం పాలయ్యారు.
జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి ఒక గుణపాఠంగా నిలిచింది. జూన్ 25 భారత రాజకీయ చరిత్రలో ఒక హెచ్చరిక దినంగా నిలిచింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో ప్రజల అప్రమత్తతే అంతిమ రక్షణ కవచమనే సత్యాన్ని ఎమర్జెన్సీ యుగం శాశ్వతంగా గుర్తుచేస్తూనే ఉంటుంది.
వ్యాసకర్త సెల్: 9440595494






