ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం
- 40 దేశాల నుంచి ఇంధనం సేకరించాం
- గ్యాస్ సిలిండర్ ధరను 950 దాటనివ్వలేదు
- సకాలంలో తీసుకున్న నిర్ణయాలే శ్రీరామరక్ష: ప్రధాని మోదీ
- రాజస్థాన్‌లో హెచ్‌పీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు ప్రారంభం
జైపూర్, జూలై ౪: ఇరవై ఒకటో శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించామని, సంక్షోభ సమయంలో తీసుకున్న సరైన నిర్ణయాలే దేశానికి శ్రీరామరక్షగా నిలిచాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న వేళ సుమారు 4౦ దేశాల నుంచి భారత్ ఇంధనం సేకరించిందని గుర్తుచేశారు. ప్రధాని శనివారం రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లాలో పర్యటించారు. ప్రతిష్ఠాత్మక హెచ్‌పీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించారు.
అనంతరం అదేచోట నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. నాడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.75,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, అయినప్పటికీ.. ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు. అలాగే, ఎల్పీజీ అవసరాల కోసం భారత్ సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నదని, మొన్నటి పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఎల్పీజీ దిగుమతులు కష్టతరమయ్యాయని, అయినప్పటికీ దేశంలో ఎల్పీజీ సంక్షోభం రాకుండా చూశామని తెలిపారు.
అప్పటి సంక్షోభంలో ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.౨వేలకు మించేదని, కానీ.. తాము తీసుకున్న నిర్ణయాలతో రూ.౯౫౦ దాటకుండా చూశామని వివరించారు. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గించామని గుర్తుచేశారు. భారత్ ఇంధన స్వయం సమృద్ధి సంకల్పంలో రిఫైనరీ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం దియా కుమారి తదితరులు పాల్గొన్నారు.
జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు నయా అందాజ్
ఆయిల్ రిఫైనరీ ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మోదీ జోధ్‌పూర్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. సుమారు 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్, ప్రయాణికుల రద్దీని సమర్థంగా నిర్వహించనుంది. విస్తరణ కోసం పౌర విమా నయానశాఖ ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్‌లను రిక్రూట్ చేసుకున్నది. వారు కొన్ని నెలల పాటు శ్రమించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, వేగవంతమైన చెక్- ఇన్ వ్యవస్థలు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, ఇతర నిర్మాణాలు పూర్తిచేశారు.






