26 February, 2026 | 9:09 AM

6జీతో ప్రయోజనాలెన్నో!

26-02-2026 12:10 AM

ముద్దం నరసింహస్వామి :

రేపటి ప్రపంచం కేవలం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలతో సంతృప్తి చెందదు. అది మానవుడు, యంత్రాల సమాజం మధ్య కొత్త సంబంధాలను నిర్వచించే యుగం. ఆరోతరం సాంకేతికత అయిన 6జీ ఇందుకు ఉత్తమ మార్గం. భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, గణితం,ఏఐ వంటి అన్ని రంగాలు కలిసి రూపొందించే ఈ సాంకేతికత భవిష్యత్తు ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ యుగంలో ఉన్న మనం రేపటి అవసరాలు దాని సామర్థ్యాన్ని మించిపోతాయని గుర్తించి 6జీ వైపు అడుగులు వేస్తు న్నాం.

డ్రైవర్ లేని వాహనాలు, సుదూర శస్త్ర చికిత్సలు, హోలోగ్రాఫిక్ సమావేశాలు వంటి అద్భుతాలు సాధ్యం కావాలంటే సాధారణ వేగం సరిపోదు. నెట్‌వర్క్ అనేది కచ్చితంగా స్పందించి చుట్టూ పరిసరాలను గమనించగలగాలి. ఈ అవసరాల నుంచే 6జీ పరిజ్ఞానం ఉద్భవించింది. 6జీలో నెట్‌వర్క్ కేవలం సమాచారాన్ని పంపడం మాత్రమే కాకుండా ఆ సమాచారం వెనుక ఉన్న అర్థాన్ని అవగతం చేసుకోనుంది. ఉదాహరణకు ఒక రోగి హృదయ స్పందనల సమాచారం పంపితే అది సంఖ్యాలుగా గాక ప్రమాదం ఉందని గుర్తించి అవసరమైన చర్యలు సూచిస్తుంది.

ఈ మార్పు 6జీని విప్లవాత్మక సాంకేతికతగా మారుస్తుంది. వచ్చే దశాబ్దం నాటికి దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రపంచం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 6జీలో అతి అధిక తరంగాలదే కీలకపాత్ర. 5జీ వరకు గిగాహెర్ట్ స్థాయిలో పని చేస్తే.. 6జీలో టెరాహెర్ట్ స్థాయి అత్యధిక తరంగాలను వాడతారు. దీంతో సమాచార వేగం భారీగా పెరిగి టెరాబిట్ల స్థాయికి చేరుకుంటుంది. వినియోగదారుడు ఎక్కడున్నా అతని వైపు మాత్రమే సిగ్నల్‌ను కేంద్రీకరించే విధానం, ఒకేసారి  వేర్వేరు సిగ్నల్స్ అందించే సామర్థ్యం, గోడలు భవనాలపై అమర్చే సిగ్నలింగ్ వ్యవస్థ 6జీ నెట్‌వర్క్‌ను మరింత శక్తిమంతం చేయనున్నాయి.

6జీ నెట్‌వర్క్ తో చాలా ప్రయోజనాలున్నాయి. సెన్సర్లు లేకుండానే మన కదలికలు, శ్వాస వేగం, హృదయ స్పందనలు గుర్తిస్తుంది. వైద్యులు అందుబాటులో లేనప్పటికీ రోబోట్‌ల సాయంతో శస్త్ర చికిత్సలు చేయవచ్చు. త్రిమితీయ హోలోగ్రామ్ తరగతుల ద్వారా గ్రామీణ విద్యార్థులు కూడా ప్రపంచస్థాయి విద్యను అభ్యసించగలరు. వ్యవసాయంలో నీటి వినియోగాన్ని తగ్గించి పంట దిగుబడులను పెంచవచ్చు. పరిశ్రమల్లో ప్రమాదాలు తగ్గి ఉత్పాదకత భారీగా పెరుగుతుంది.

గ్రామీణప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం, విద్య అందుబాటులోకి వస్తాయి. 6జీ సాంకేతికత అభివృద్ధిలో సవాళ్లూ ఉన్నాయి. తరంగాలు బలహీనపడడంతో పాటు కొత్త రకం చిప్స్ తయారీ కష్టతరమవుతుంది. అధిక విద్యుత్ వినియోగం ఇంకో ప్రధాన సమస్య. సైబర్ దాడుల ముప్పు పెరుగుతుంది. చైనా, అమెరికా, యూరప్, జపాన్‌లు ఈ రంగంలో ముందంజలో ఉన్నప్పటికీ, భారత్ 6జీ దృక్పథ పత్రం ద్వారా స్పష్టమైన మార్గం చూపించింది. 

ఇటీవల న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా భారత్ 6జీకి మద్దతు తెలిపింది. 6జీ కేవలం సాంకేతికత కాదు. ఇది ఆర్థిక సార్వభౌమత్వం, డిజిటల్ సమానత్వం, వికసిత భారత్ ను సాకారం చేసేందుకు ముఖ్యమైన మార్గం. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తే భారత్ 6జీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు. రేపటి ప్రపంచంలో భారత్ బలమైన స్థానం సంపాదించాలంటే 6జీ సాంకేతికతకు సన్నద్ధం కావాల్సిన అవసరముంది.