26 June, 2026 | 6:06 PM

మత్తు రహిత మంచిర్యాలే లక్ష్యం..

26-06-2026 04:45 PM

- ఘనంగా 2కే రన్

* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ 

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ అవగాహన 2కే రన్ నిర్వహించారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ పర్యవేక్షణలో, టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్.. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి ప్రత్యేక అంబేద్కర్ చౌరస్తా వరకు ఉత్సాహంగా సాగింది.

ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సమాజానికి పెద్ద మహమ్మారిగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నాయని, ఈ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్-100 లేదా 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

డీ-అడిక్షన్ కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి - కలెక్టర్ కుమార్ దీపక్

"డ్రగ్స్‌కు నో చెప్పండి... జీవితానికి యెస్ చెప్పండి" అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మత్తుకు బానిసైన వారిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ కేంద్రం ద్వారా ఉచిత వైద్యం, కౌన్సెలింగ్, పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపామని హెచ్చరించారు. ఈ అవగాహన ర్యాలీలో 13వ బెటాలియన్ కమాండెంట్, ఏసీపీ ఆర్. ప్రకాష్, టౌన్ సీఐ ప్రమోద్‌రావు, అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు సిబ్బందితో పాటు విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.