15 April, 2026 | 5:46 AM

30 ఏళ్ల నుంచి ఇళ్ల పట్టాలు లేవు

02-12-2025 12:00 AM

మాది నిర్మల్ జిల్లా తనూర్ మండలం బోల్సా గ్రామంలోని సీతారాం కాలనీ. మా కాలనీ రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో వానాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏటా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు బురదలో నడుస్తూ.. వాహనాలు నడుపుతూ చాలా అవస్థలు పడుతున్నాం. మరమ్మతులు చేయండని అనేకసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.

మా కాలనీకి గ్రామపంచాయతీలో గుర్తింపు లేదని, మా ఇళ్లకు పట్టాలు లేవు.. మేము ఎలా రోడ్డు నిర్మాణం చేపడతాం, తాగునీటి వసతులు ఎలా కల్పిస్తామని మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు ఇస్తలేరు.. రోడ్డు నిర్మాణం చేపడుతలేరు. తాగునీటి సౌకర్యం లేదు. అధికారులు, పాలకులు  స్పందించి మా సీతారాం కాలనీని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. 

 జవారే రాహుల్ బోల్సా గ్రామం, నిర్మల్ జిల్లా

రేషన్ షాపు ఏర్పాటు చేయండి

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మా గ్రామంలో రేషన్ షాపు లేదు. మా గ్రామం ఆదివాసీలు ఉంటున్న ఊరు. ఒక్కప్పుడు కొల్వాయికి అనుబంధ గ్రామంగా ఉండేది. ప్రస్తుతం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. మా గ్రామంలో 50 కుటుంబాలు, 200 జనాభా ఉంటుంది. మేరు ప్రతి నెల రేషన్ బియ్యం కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొల్వాయి గ్రామానికి వెళ్లి తెచ్చుకుంటున్నాం.

అక్కడి నుంచి తిరిగి ఇంటికి బియ్యం తెచ్చుకోవడం కష్టంగా మారింది. మా గ్రామంలోనే రేషన్ ఏర్పాటు చేయాలని గతంలోనూ అనేకసార్లు పాలకులకు, అధికారులకు విన్నవించుకున్నాం. అయినా మా విన్నపాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి మా గ్రామంలోనే రేషన్ షాపును ఏర్పాటు చేసి మా ఆదివాసీల సమస్యలు తీర్చాలి. మేమంతా రేషన్ ద్వారా సరుకులపై ఆధారపడి బతుకుతున్నాం.

 ఉమేష్, చిన్నకొల్వాయి, మంచిర్యాల జిల్లా

వైన్ షాప్‌తో ఇబ్బందులు పడుతున్నాం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ చౌరస్తా (బ్లాక్ స్పాట్) జోన్‌లో ఏర్పాటు చేసిన వైన్ షాప్‌ని వెంటనే తొలగించాలి. రాష్ర్టంలోనే ప్రమాదాల నమోదులో రెండవ స్థానంలో ఉన్న ఈ జోన్ పరిధిలో శరణ్య గ్రీన్ హోమ్స్ గే టెడ్ కమ్యూనిటీలో 130 కుటుంబాలు నివాసంముంటున్నాయి. ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మందుబాబుల చేష్ఠలు అసహనానికి గురి చేస్తున్నాయి.

రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.  గతంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఆబ్కా రీ శాఖ అధికారులకు, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేసినా మా విన్నపాన్ని పరిగణలోకి తీసుకోకుండా వైన్ షాప్ ఏర్పాటు చేశారు. దయచేసి ఈ వైన్‌షాపును ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం. మా ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.

                                    స్వాతి, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా