షరా మామూలే!
ఊహించినట్లుగానే పార్లమెంటు సమావేశాలు మొదలైన మొదటి రోజే ఉభయ సభల్లో ఢిల్లీ శీతలగాలులను తోసిరాజని వాతావరణం వేడెక్కింది. వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో ఈ పార్లమెంటు సమావేశాలు అధికార, విపక్షాల మధ్య విషం చిమ్ముకునే రకంగా ముగియవద్దనే కోరుకుందాం.
ఇది అత్యాశ కాకూడదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆనవాయితీగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తనున్న సమస్యలను దృష్టిలో వుంచుకొని వారిది అంతా వుత్తి డ్రామా అని కొట్టిపారేసారు. ఇది చాలదా ప్రతిపక్షాలను రెచ్చగొట్టడానికి! విధాన నిర్ణయాలు, రాజకీయం మధ్య జగడం తీవ్రమై అసలు పార్లమెంటు పనిచేయకుండానే ముగిసే దుస్థితి వచ్చింది.
శీతాకాల సమావేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో చేపట్టిన ‘సర్’ ఎన్నికల సంఘాన్ని సంస్కరించే విషయాలను చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. వందేమాతరం గీతంపై కూడా చర్చించాలని అధికారపక్షం చెబుతోంది. రాజ్యసభ చైర్మన్‌గా కొత్తగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ మొదటిసారిగా రాజ్యసభకు నాయకత్వం వహించడం ఈ సమావేశాల ప్రత్యేకత. ప్రధాని సహా అధికార, ప్రతిపక్ష నాయకులు ఆయనను అభినందించారు.
నిజానికి, వాయుకాలుష్యం ఢిల్లీవాసులకు దుర్భరంగా మారింది. దేశంలోని మెట్రో నగరాల్లోనూ అదే పరిస్థితి. ఢిల్లీలో అనేక రోజులుగా కొనసాగుతున్న వాయుకాలుష్యం సమస్యను పార్లమెంటులో లేవనెత్తాలనుకోవడంలో ప్రతిపక్షాలను నిందించాల్సిన అవసరం లేదు. ఇక ‘సర్’ వల్ల ఎన్నికల సంఘం అధికార పక్షానికి ప్రయోజనం చేకూర్చిపెడుతున్నదని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి.
ఈ సమావేశాల్లో అదే అంశాన్ని ప్రతిపక్షాలు కొనసాగించాలని చూస్తున్నాయి. అయితే దీనివల్ల ప్రయోజనమేమైనా వుంటుందా అనేది అనుమానమే. అటు కాలుష్యం సమస్యను, ఇటు ‘సర్’ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడమేమోగాని ఇదంతా వారి ‘డ్రామా’ అని ప్రధాని మోదీ కొట్టివేయడం ఆక్షేపణీయమే. రాజకీయాల్లో ఇలా కొట్టివేయడం ఒక భాగమనుకున్నా, ఇది కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించేదే.
ప్రజా ప్రయోజన అంశాలను చర్చకు పెట్టాలనుకోవడం ‘డ్రామా’ అయితే, అసలు ప్రజాసమస్యలు చర్చకు రాకుండా చేసే ప్రయత్నం ‘డ్రామా’ కాదా అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నిస్తున్నారు. బిల్లులను ఆమోదించుకోవాలనే తొందర తప్ప అధికారపక్షానికి ప్రజా సమస్యలు పట్టడం లేదనేది కాంగ్రెస్ పార్టీ అభియోగం. బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.
అయితే ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గల సంస్థ కావడం వల్ల దానిపై పార్లమెంటులో ప్రభుత్వం ఎలా చర్చకు అనుమతిస్తుందనేది అధికారపక్ష వాదన. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సజావుగా పనిచేసేందుకు ఇటు ప్రభుత్వ బిల్లుల ఆమోదానికైనా, ప్రతిపక్షం లేవనెత్తే అంశాల చర్చకైనా ఇరువైపులా కావలసింది సంయమనమే. లేదంటే, మొదటిరోజులా లోక్‌సభ వాయిదా నిత్యకృత్యమవుతుంది.






