08-01-2026 01:17:46 AM
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : ప్రజల కోసం రాజకీయం చేయా లి కానీ నీళ్లపై రాజకీయం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా రు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని తెలిపారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడి యాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో రాజకీయాలు చూస్తుంటే అర్థం కాకుండా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
దేవాదుల ప్రాజెక్టు గోదావరి నదిపై ఎగువ ప్రాంతం లో ఉందని, పోలవరం దిగువన ఉందని, దేవాదుల నుంచి మీరు నీళ్లు తీసుకున్నప్పు డు తాను అభ్యంతరం చెప్పకపోయినప్పటి కీ.. పోలవరం నుంచి నీళ్లు తీసుకోవడంపై మీరు అభ్యంతరం చెప్పడంలో అర్థముం దా అని ప్రశ్నించారు. తెలంగాణలోని దేవాదుల, కల్వకుర్తి తానే ప్రారంభించానని, కృష్ణాలో 20 టీఎంసీల నీళ్ల పొదుపు చూపించి భీమా పూర్తి చేశామని గుర్తు చేశారు.
ఆర్డీఎస్‌లో నీరు లేకపోతే జూరాల లింక్ పెట్టి మహబూబ్‌నగర్‌లో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పా రు. హైదరాబాద్‌కు వారానికి ఒక్కసారి తాగునీరిచ్చే పరిస్థితి నుంచి నాగార్జునసాగర్ నీళ్లిచ్చామని తెలిపారు. తెలుగుజాతి కోసం అద్భుతమైన నగ రం ఉండాలని మంచి ఎకో సిస్టం తయారు చేశామని, దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్‌కం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ కావడం సంతోషమన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్ట్, హెటెక్ సిటీ, సైబరాబాద్,బయోటెక్నాలజీ, ఫార్మా, ఫైనాన్స్ డిస్ట్రిక్ అన్ని ఆ రోజున పెట్టినవే, కానీ ఇవన్నీ తామే చేశామని ఏ రోజు చెప్పలేదన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పైన మీరు తీసుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. పోలవరం వద్ద పొదుపు చేసుకుని నీళ్లు ఇస్తే రాయలసీమ బాగుపడుతుందని, మిగులు జలాలు ఉన్నప్పుడు అవసరమైతే తెలంగాణకు కూడా వాడుకునే అవకాశం ఉంటుందన్నారు.
కానీ నీళ్ల అంశంలో తెలంగాణ నాయకులు పోటీ పడి మరీ మాట్లాడుతున్నారని, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కృష్ణా నదీలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టమని, కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదన్నారు. రాయలసీమ ఎత్తి పోతలపై ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఉందా అని ప్రశ్నించారు. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ ప్రాజెక్టుపై 2020లోనే ఎన్జీటీ స్టే..
రాయలసీమ ఎత్తిపోతలపై 2020మేలో తెలంగాణ నుంచి ఎన్జీటీని ఆశ్రయించారని, ఏపీ వద్ద ఉన్న అనుమతులను సమర్పించాలని, అప్పటివరకు స్టే ఇచ్చారని గుర్తు చేశారు. 2020 జూలైలో డీపీఆర్ ఇవ్వాలని సూచిస్తే దానిని అడ్డం పెట్టుకుని ఆనాటి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని వెల్లడించారు.
అదే సంవత్సరంలో ఎన్జీటీ జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని ప్రాజెక్టు పనులను ఆపారని చెప్పారు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పటికీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది నాపై బురద జల్లాలని ప్రయత్నించారని తెలిపారు. దేశంలోనే నదుల అనుసంధానం జరగాలని, తద్వారా దేశమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు.
రాష్ట్రం లోని అన్ని ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఎవడికీ ప్రాజెక్టులు తెలియవని, జియోగ్రఫీ తెలియకుండానే రాజకీయాలు మాత్రం మాట్లాడుతారని విమర్శించారు. నీళ్ల విషయంలో రాజకీయాలు అవసరం లేదని, తెలుగు జాతి అంతా ఒక్కటే అని, రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని హితవు పలికారు. ౨ రాష్ట్రాల ప్రజల మధ్య విరోధం పెట్టడం, సెంటిమెంట్‌తో ఆడుకోవడం మంచిది కాదన్నారు.