20-12-2025 12:38:53 AM
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ప్రజావాణి వంటి కార్యక్రమం మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడ కూడా అమ లు జరగడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి రెండో వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిం చారు. ప్రభుత్వం, పాలన ప్రజల కోసమే అని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ సహచరులు అంతా కలిసి తీసుకున్న విప్లవాత్మక నిర్ణ యం ప్రజావాణి అని డిప్యూటీ సీఎం వివరించారు.
ప్రజల సమస్యలు విని పరిష్కారం చేయడానికి ప్రతి మంగళ, శుక్రవారాలు క్రమం తప్పకుండా దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. 74 శాతం సమస్యలను పరిష్కరించడం గొప్ప విజయమని తెలిపారు. ప్రజావాణి పెట్టడమే కాదు వచ్చిన దరఖాస్తులను నిబద్ధతతో దృష్టి సారించి ఉద్యోగ బృందం ప్రయత్నించకుంటే 74 శాతం విజయం సాధ్యం కాదని తెలిపారు. ఇంకా పరిష్కారం కాని పైప్‌లైన్‌లు వంటి అంశాలను పరిష్కరించే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు.
ఏ సంకల్పంతో ప్రజావాణిని ప్రారంభించామో ఆ లక్ష్యం నెరవేరు తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజావాణి లో విజయ గాధలు వింటుంటే సిబ్బంది ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో అర్థం అవుతోందన్నారు.
అందుకే ఈ సమావేశానికి వచ్చానని తెలిపారు. మా ఆలోచన, పాలన, వ్యవహారం అంతా ప్రజలకే అంకితం అని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్లానింగ్ బో ర్డు వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, డైరక్టర్ జనరల్ రవి గుప్తాను, హౌసింగ్ ఎండీ గౌతమ్, అధికారులు పాల్గొన్నారు.