కొరత లేదు
- సరిపడా ఇంధన నిల్వలున్నాయి
- వదంతులను నమ్మొద్దు
- పెట్రోల్ , డీజిల్‌ను డబ్బాలు, కంటైనర్లలో నింపితే కఠిన చర్యలు
- రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచన
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లో డీజిల్,పెట్రోల్ బంక్‌ల వద్ద పెద్దఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇంధన వనరులతో పాటు ఎల్పీజీ కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజలెవ్వరు గందరగోళంలో పడొద్దని మంత్రి సూచించారు. అయితే అదే సమయంలో వినియోగదారులు కంటైనర్లలో, డబ్బాలలో పెట్రోల్, డీజిల్‌ని తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని, అంతకుమించి ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. పెట్రోలియం నిల్వలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని, సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేందుకు వీలుగా ఓజీఎస్ లైన్‌ను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు.
బుధవారం అసెంబ్లీలో తన ఛాంబర్‌లో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలసి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కొరత ఉందంటూ జరుగుతున్న వదంతులతో అయోమయంలో పడొద్దన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో పాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు.
డిమాండ్‌ను మించి సరఫరా కొనసాగుతోందని, ఈరోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ ఉందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1,200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు.
వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో రోజువారి డిమాండ్ ఒక్కసారిగా 25 శాతం పెరిగినా సరఫరాలో ఎక్కడా అంతరాయం కలుగకుండా సరఫరా జరుగుతుందన్నారు. అయితే కొన్ని పెట్రోలు బంక్‌లకు నిర్ణిత సమయానికి ట్యాంకర్లు చెరుకోకపోవడంతో ఆయా బంక్‌లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. వాస్తవంగా ఎంతమాత్రం కొరత లేదని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్‌లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని, అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, ధారవాడ, బెల్గాం వంటి నగరాలలో కూడ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యిందన్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించమన్నారు.
ఇదే సందర్భంలో అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్పీజీ సమృద్ధిగా అందుబాటులో ఉందని, అయోమయానికి గురి కావొద్దని, వదంతులను నమ్మొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచించారు.




