జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు
ఇంటి వద్దకే సరఫరా : కలెక్టర్ పీ ప్రావీణ్య
సంగారెడ్డి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): జిల్లాలో ఎల్పీజీ వంట గ్యాస్ కొరత లేదని, ప్రతి ఇంటికీ గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఎల్పీజీ సరఫరా మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురితో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ, పోలీస్ శాఖల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ... జిల్లాలో కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన వంట గ్యాస్ను ఇంటి వద్దకే సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్యాస్ సరఫరా పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు గ్యాస్ కొరత రాకుండా సరఫరా కొనసాగించాలని సూచించారు.
గ్యాస్ పంపిణీలో అక్రమాలు జరగకుండా విజిలెన్స్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి, అక్రమ నిల్వలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఏం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (ఇంచార్జ్) రాజేశ్వర్ ,రవాణా శాఖ అధికారిణి అరుణ , సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్, డి ఎల్ ఏం ఓ ఏం అనిల్ కుమార్ , ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పి.ప్రతాప్ రెడ్డి, జె.మురళీధర్ రెడ్డి, వై.వినోద్ కుమార్, పోలీస్ శాఖ అధికారులు , సివిల్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.






