calender_icon.png 3 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు తావు లేకుండా చూడాలి

03-12-2025 12:00:00 AM

జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సీతాలక్ష్మి 

నారాయణపేట, డిసెంబర్ 2, (విజయక్రాంతి): నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  సాధారణ ఎన్నికల పరిశీలకురాలు సీతాలక్ష్మి సూచించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలకు సంబంధించి దామరగిద్ద మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు మంగళవారం  దామరగిద్ద మండలం విఠలా పూర్ గ్రామ పంచాయతీలోని  నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని  సందర్శించారు.

ఈ సందర్భంగా  అధికారులకు పలు సూచనలు చేశారు.  ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆమె పరిశీలించారు. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైందని, మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, అందుకని అభ్యర్థులు ముందు జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. వీరి వెంట  స్థానిక అధికారులు వెంకటేష్ డిప్యూటీ ఎస్‌ఓ మరియు నటరాజ్ తదితరులు ఉన్నారు.