calender_icon.png 3 December, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో ఎన్నికల సందడి

03-12-2025 12:00:00 AM

కల్వకుర్తి, డిసెంబర్ ౨ : పంచాయతీ ఎన్నికలు  సమీపిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో కోలాహల వాతావరణం వేడెక్కింది. మొదటి విడత ఎన్నికల్లో జరుగుతున్న నియోజకవర్గంలోని కల్వకుర్తి వెల్దండ, వంగూరు మండలాల్లో ఆశావహులు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి పల్లెలోనూ అభ్యర్థులు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకుంటూ వ్యూహరచనలో నిమగ్నం అవుతున్నారు.

ముఖ్యంగా ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఆయా ప్రధాన పార్టీల్లో పోటీ హోరాహోరీగా మారింది. గెలుపు కోసం అభ్యర్థులు భారీ స్థాయిలో ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న కల్వకుర్తి  నియోజకవర్గంలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న మార్చాలా, కుర్మిద్ద, తాండ్ర, కొట్ర , వెల్దండ, పెద్దాపూర్ తదితర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ఇక్కడ  ఎంతైనా ఖర్చు చేసి గెలుపొందాలనే లక్ష్యంతో అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కోరిక మరింత తీవ్రమై, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు మండలాల నుండి ప్రత్యేక బృందాలను కూడా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం వారు అధికంగా హైదరాబాదులో నివాసం ఉండేవారు ఉండడంతో ఇప్పటికే వారి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ అభివృద్ధి పేరుతో హామీల పరంపరను కొనసాగిస్తున్నారు.

కొన్ని గ్రామాల్లో పోటీ అధికంగా ఉండి రెండు మూడు వర్గాలుగా విడిపోతుండడంతో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. పాతకాలం నుంచి ఉన్న పంచాయతీరంగ రాజకీయాలు, కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు, వర్గపోట్లు ఈ ఎన్నికల్లో తిరిగి మళ్లీ రేకెత్తే అవకాశం  లేకపోలేదు. ప్రచారంలో భాగంగా సామాజిక వేదికలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

యువతను ఆకర్షించేందుకు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం జోరందుకుంది. గ్రామాల్లో రాజకీయ శక్తి సమీకరణలు వేగంగా మారుతుండడంతో పోటీలో ఉండేది ఎవరు గెలిచేది ఎవరో అని ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. నామినేషన్ ల ఉపసంహరణ బుధవారం చివరి రోజు కావడంతో  బరిలో ఉండే అభ్యర్థులు ఎవరనేది తేలనుంది.

కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఏక గ్రీవం కావడంతో అక్కడ ఎలాంటి అడావిడి లేకుండా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉండేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతుండడంతో పాలకులకు తలనొప్పిగా  మారింది.

అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఆశావాహులు ఇద్దరు ముగ్గురు చొప్పున రెబల్ స్థానంలో నిల్చడంతో ఓకే నేతలకు బుజ్జగించేందుకు తలనొప్పిగా మారింది. చాలాకాలంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కోలాహలంగా మారింది.