శిలాఫలకం వేశారు.. మరిచిపోయారు..
- అధ్వాన్నంగా పల్లె గడ్డ తండా రోడ్డు
- వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి
తాడ్వాయి, ఏప్రిల్, 22( విజయ క్రాంతి ): గత నాలుగు సంవత్సరాల క్రితం పల్లె గడ్డ తండా బీటి రోడ్డు నిర్మాణం కోసం అధికారులు హడావిడిగా శిలాఫలకం వేశారు. ఎన్నికలు వస్తున్నాయని నాయకులు హడావిడి చేసి శిలాఫలకం వేయించారు.నిధులు మంజూరయ్యాయి,వెంటనే పనులు ప్రారంభిస్తామని నమ్మబలికారు.కానీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. శిలాఫలకం వేసి నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్న ఇప్పటికీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు కాలేదు.
రోడ్డుకు నిధులు మంజూరయ్యాయి వెంటనే పనులు చేపడతామని చెప్పిన నాయకులు పత్తా లేకుండా పోయారు. అప్పట్లో ఎమ్మెల్యే గా ఉన్న సురేందర్ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయి రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.కానీ ఇప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పల్లె గడ్డ తండా రోడ్డు అద్వానంగా ఉంది. నందివాడ నుంచి అధికారులు 2 కిలోమీటర్ల రోడ్డు ను బీటీ రోడ్డుగా మార్చారు.మరో కిలోమీటర్ రోడ్డును అలాగే వదిలేశారు. నిధులు లేవని నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పనులు జరగలేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు పంపడం లోనే పొరపాటు..
గతంలో నందివాడ నుంచి పల్లెగడ్డ తండా సమీపం వరకు బీటీ రోడ్డు నిర్మించారు.మరో కిలోమీటర్ బీటీ రోడ్డును నిర్మిస్తే సామదుబ్బ తుండా వరకు రోడ్డు పూర్తయ్యేది.అప్పట్లో నందివాడ నుంచి పల్లెగడ్డ తండా,సామదుబ్బ తండా వరకు రోడ్డు నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నందివాడ నుంచి వయా పల్లె గడ్డ తండా, సామదుబ్బ తండా వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో సరిగ్గా కొలతలు తీసుకొని రోడ్డుకు అవసరమయ్యే ప్రతిపాదనలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
కానీ అధికారులు అలా చేయకుండా నిర్లక్ష్యంగా కార్యాలయంలో ఉండి రెండు కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు.దీంతో రెండు కిలోమీటర్ల వరకే బీటి రోడ్డుకు నిధులుమంజూరు అయ్యాయి.మిగతా ఒక కిలోమీటర్ రోడ్డు బిటి రోడ్డు కాలేదు.అలాగే మిగిలిపోయింది.దీంతో తండవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు సామదుబ్బ తండా, పల్లె గడ్డ తండాల నుంచి తమ అవసరాల కోసం నందివాడ,తాడ్వాయి మండల కేంద్రానికి, కామారెడ్డి పట్టణానికి వెళుతుంటారు.రోడ్డు అధ్వానంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు..
వర్షాకాలం వచ్చిందంటే చాలు మాకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని తండావాసులు వాపోతున్నారు.తాము ఎన్నిసార్లు అధికారుల చుట్టూ,నాయకుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మిగిలిపోయిన ఒక కిలోమీటర్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి.వర్షాకాలం వచ్చిందంటే రోడ్డంతా బురదగా మారి ప్రమాదాలు జరుగుతాయి.వెంటనే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి రోడ్డును పూర్తి చేయాలని పల్లె గడ్డ తండా, సామదుబ్బ తండాలకు చెందిన తండావాసులు కోరుతున్నారు.
వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
సామదుబ్బ తండా వరకు వెంటనే బీటీ రోడ్డును నిర్మించాలి.బిటి రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి.రోడ్డు అద్వానంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలి.గతంలో శిలాఫలకం వేశారు, వెళ్లిపోయారు ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు.
- రూప్ సింగ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సామదుబ్బ తండ






