30 May, 2026 | 1:49 AM

పేర్చారు.. కాల్చారు..

30-05-2026 12:46 AM
  1. అటవీ శాఖ అధికారులకు కాసుల వర్షం?
  2. సమీప గ్రామ ప్రజలకు వాయు కాలుష్యం 
  3. బట్టికి రెండు లారీల కలప భస్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులు 

భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (విజయక్రాంతి): తిలా పాపం... తలా కొద్దిగా... అన్నట్లు ఉంది అక్రమ ఇటుక వ్యాపారుల తీరు. అసలే అనుమతులు ఉండవు, ఆపైన అక్రము కలపతో ఇటుకలను కాలుస్తూ ప్రజా ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. లాభా పెక్షనే ప్రధాన అంశంగా ఇటుక బట్టీల వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరు అన్ని చట్టాలను తుంగలోకి తొక్కుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం కోనారం గ్రామంలో, ఆళ్లపల్లి రోడ్డుకు అతి సమీపంలో ఏర్పాటుచేసిన ఇటుకల వ్యాపారం అందుకు నిదర్శనం.

ఒక్కొక్క బట్టి ఇటుకలను కాల్చేందుకు సుమారు రెండు లారీల వరకు అటవీ కలపను కాల్చి బూడిద చేస్తున్న ఫారెస్ట్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం అక్రమ ఇటుక వ్యాపారాలనుంచి వారికి అందుతున్న నెలవారి నజరానే కారణమని స్పష్టం అవుతోంది. సామాన్య మానవుడు పొట్ట తిప్పల కోసం సైకిల్ పై పొయ్యిల కట్టెలు తెచ్చుకుంటున్న అడ్డగించే అటవీశాఖ అధికారులు లారీల కొద్ది కలపను ఇటుకలను కాల్చేందుకు వినియోగిస్తున్న చర్యలు తీసుకపోవడం అందుకు నిదర్శనం.

కలపను పేర్చామా... కాల్చామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అక్రమ ఇటుక వ్యాపారులు. రోడ్డుకు అతిశమీపంలో ఇటుకల వ్యాపారం నిర్వహించరాదని, సాగు భూముల్లో ఇటుక బట్టీలు నిర్వహించరాదని, సాగుకు ఉపయోగం లేని భూమిలో మాత్రమే ఇటుకల వ్యాపారం చేయాలని, పట్టా భూమి కలిగి ఉంటే తప్పనిసరిగా రెవెన్యూ అధికారుల నుంచి కన్వర్షన్ ఉండాలని తదితర నిబంధనలను పాటించకుండా అక్రమ వ్యాపారం జోరుగా చేస్తున్నారు.

ఇటుకలను కాల్చేందుకు కలపను సైతం అక్రమంగా తరలించి కాల్చి బూడిద చేస్తున్నారు. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ స్థానికులకు వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ ఇటుకల వ్యాపారంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.