రైతుల విద్యుత్ కష్టాలపై బీజేపీ ధర్నా
ఏఈకి వినతి పత్రం
ఆలేర్,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ పట్టణంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు ఏడీ/ఏఈ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ లో వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా రైతుల మోటార్లు, ఆటోమేటిక్ స్టార్టర్లు కాలిపోతున్నాయని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ అధికారులు సమయపాలన పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీయడం వల్ల ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ జనరల్ సెక్రెటరీ ఎలగల వెంకటేష్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఏఈ గారికి వినతి పత్రం అందజేశారు. రైతుల విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి, సక్రమంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వినతి పత్రంలో కోరారు.






