17-11-2025 01:34:08 AM
మట్టి చెట్టతో నిండిన వైనం. పట్టించుకోని అధికార ఘనం.
ఉపయోగంలోకి తేవాలంటున్న జనం
నూతనకల్, నవంబర్ 16: మండల పరిధిలో పశువుల దాహార్తిని తీర్చే లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్లు ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకోక పోవడంతో, అవి శిథిలావస్థకు చేరి, అసలు ప్రయోజనాన్ని కోల్పోయాయి. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి గ్రామం చుట్టూ నాలుగు కూడళ్లలో పశువులు మేతకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో నీరు తాగడానికి వీలుగా ఈ తొట్లను నిర్మించారు.
అయితే, మిర్యాల గ్రామంలో ఈ తొట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నీటి తొట్లు ప్రస్తుతం చెట్లు మొలిచి, పాడుబడినట్లుగా దర్శనమిస్తున్నాయి.దీని కారణంగా, వేసవిలో ఇతర సమయాల్లో దాహంతో అలమటించే పశువులకు నీటి సౌకర్యం కరువైంది. పశు సంపదపై ఆధారపడిన రైతులకు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది.వెంటనే అధికారులు స్పందిం చి, నిరుపయోగంగా ఉన్న నీటి తొట్లను పునరుద్ధరించి,
తొట్లలో చేరిన చెత్త, చెదారం, మొక్కలను తొలగించి, వాటిలో నిరంతరం నీరు నిల్వ ఉండే లా చర్యలు తీసుకోవాలని, నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ తొట్లను ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా పశువులకు ఉపశమనం కలుగుతుందని, అధికారులు తక్షణం దృష్టి సారించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పశువుల దాహర్తి తీర్చాలి
నీటి తొట్లను కేవలం శుభ్రం చేసి, నీరు నింపడం ద్వారా పశువుల దాహార్తిని తీర్చవచ్చు. అధికారులు వెంటనే దృష్టి సారించి, ఈ చిన్నపాటి చర్య తీసుకుంటే పశువులకు ఉపశమనం లభిస్తుంది. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. - కొంపెల్లి కళ్యాణ్, రైతు మిర్యాల