17-11-2025 01:15:34 AM
-చట్టపరమైన రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
-పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోం
-అఖిలపక్షంతో ప్రధానితో చర్చలు జరపాలి
-మాట మార్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయి
-బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్
-హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
-కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
-ఎమ్మెల్సీ ఎల్ రమణ
ముషీరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): పార్టీలపరంగా కల్పించే రిజర్వేషన్ల తో కాకుండా చట్టపరమైన 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీ జాక్ చైర్మన్ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై అఖిలపక్షంతో ప్రధానమంత్రితో చర్చలు జరపాలని అన్నారు.
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దు చట్టబద్ధంగా కల్పించాలని, తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (బీసీ జేఏసీ) ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్ష బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండా దత్తాత్రేయ, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కో-ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ రిషి అరుణ్ కుమార్, బీసీ కుల సంఘాలు, పలువురు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సంద ర్భంగా బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణ య్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని, పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోబోమని అని అన్నారు.
అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వేలాదిమంది మద్దతుతో బీసీలలో చైతన్యం వచ్చిందన్నారు. ఈ రిజర్వేషన్ల పోరాట పటిమ పెరిగిందని పేర్కొన్నారు. గతంలో అనేక సార్లు రాష్ట్ర ముఖ్య మంత్రి, మంత్రులు, పార్టీ అధ్యక్షులు చట్టబద్దంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని. ప్రస్తుతం మాట మార్చితే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నెల రోజులు ఆగితే తీర్పు వస్తుందని, కేసు గెలవడానికి బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు.
అ లాంటప్పుడు ఎన్నికలకు నిర్వహించేందుకు తొందరెందుకు అని ? బీసీ లకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయ రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ నిబం ధనకు ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేదన్నారు. ఇది పూర్తి అసంబద్ధమైనదన్నా రు. రిజర్వేషన్ల కేసులో 30 బీసీ సంఘాలు కేసులు వేశారని, పిటిషనర్ల వాదన కూడా వినకుండా ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమన్నారు.
బలమైన ఆదారాలతో కేసు గెలుస్తుందన్నారు. స్థానిక ఎన్నికలకు తొందరెందుక న్నారు. జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా నియోజక, మండల, కేంద్రాలలో బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలతో సమావేశాలు జరిపి కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీలు అనేక ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి రిజర్వేషన్లు అమలు కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమల్లో కాలయాపన చేస్తే సహిం చేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమములో డాక్టర్ చంద్ర శేఖర్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, నాయకులు లాల్ కృష్ణ ప్రసాద్, టి. రాజ్ కుమార్, జి. అనంతయ్య, పగిళ్ల సతీష్, జిల్లపల్లి అంజి, శివ కుమార్ యాద వ్, మోడీ రాందేవ్, వేణుమాధవ్, భాను ప్రసాద్ యాదవ్, కిషోర్ యాదవ్, కురుమ సంఘం అధ్యక్షులు మల్లేష్ యాదవ్, గౌడ సంఘం మహిళ అధ్యక్షురాలు అనురాధ గౌడ్, వివిధ కుల సంఘాల,పార్టీల నాయకులు పాల్గొన్నారు.