09-06-2025 02:30:03 AM
నటిగానే కాకుండా సంప్రదాయ నృత్యకారిణిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి శోభన. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో తెరకెక్కిన సినిమాల్లో వివిధ పాత్రల్లో మెప్పించారు. కళారంగానికి శోభన చేస్తున్న సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘తుడరుమ్’ చిత్రం ఇటీవల విడుదలై మలయాళంలో మంచి వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా శోభన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా శోభన.. అమితాబ్ బచ్చన్ వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. “అమితాబ్ బచ్చన్ ఎంతో మంచి వ్యక్తి. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఏమీ మారలేదు.
కల్కి2898డీ’ కంటే ముందు ఎన్నో ఏళ్ల క్రితం అమితాబ్ హీరోగా పనిచేసిన ఓ సినిమాలో నేనొక పాటకు డ్యాన్స్ చేశాను. ఆ ప్రాజెక్టు మొత్తంలో నేను చేసింది ఒక్క సాంగ్ మాత్రమే అయినప్పటికీ చాలా కాస్ట్యూమ్స్ మార్చుకోవాల్సి ఉంది. అహ్మదాబాద్‌లో షూటింగ్ జరగ్గా.. అప్పుడు హీరో కోసం కారవాన్ తెప్పించారు. ఆయన్ను చూసేందుకు అహ్మదాబాద్ నుంచి ప్రజలు భారీ సంఖ్యలో సెట్లోకి వచ్చారు.
షూట్లో భాగంగా నేను దుస్తులు మార్చుకోవాల్సి రావటంతో.. ‘నా కారవాన్ ఎక్కడ?’ అని నేను యూనిట్ సభ్యులను వాకబు చేస్తుండగా.. వారిలో ఓ వ్యక్తి.. ‘ఆమె కేరళ నుంచి వచ్చారు. అక్కడివాళ్లు దేనికైనా సర్దుకుపోతారు. కాబట్టి ఆమె చెట్ల వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకుంటుందిలే’ అనడం నా చెవిన పడింది. ఆ మాటలను వాకీటాకీలో విన్న అమితాబ్‌కు బాగా కోపం వచ్చింది..
వెంటనే కారవాన్ నుంచి బయటకు వచ్చి ఆతడ్ని తిట్టారు. తన కారవాన్‌ను నాకు ఇచ్చారు. అది జరిగిన తర్వాత చాలా ఏళ్లకు ‘కల్కి’ కోసం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మరోసారి దక్కింది. సంస్కృతి సంప్రదాయాలకు అమితాబ్ ఎంతో విలువనిస్తారు. ‘కల్కి’ చిత్రీకరణ సమయంలో తనవద్దకు ఎవరైనా వస్తే, లేచి నిల్చోని విష్ చేసేవారు. ‘మీరు లేచి విష్ చేయాల్సిన అవసరం లేదు సర్’ అని చెప్పినా వినిపించుకునేవారు కాదు” అని శోభన తెలిపారు.