దృష్టి మరల్చి చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్
కూకట్ పల్లి, ఆగస్టు 22(విజయక్రాంతి) : దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడుతున్న నేరస్తున్ని కేపిహెచ్ బి పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం ఈజీ మనీ కి అలవాటు పడ్డ ఓ బి టెక్ పూర్తిచేసిన నిరుద్యోగి బ్యాంకులు ఏ టీ ఎం ల వద్ద వృద్దులను లక్ష్యంగా చేసుకొని దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కెపిహెచ్బి కాలనీ 9వ ఫేజ్ లో ఈనెల 13న జయలక్ష్మి అనే టీచర్ తన వద్దనున్న రెండు లక్షల రూపాయలను ఎస్ బి ఐ బ్యాంకు డిపాజిట్ మెషిన్ లో డబ్బులు జమ చేయడానికి వెళ్ళింది.
అక్కడనే కాపు కాచుకొని కూర్చున్న కురంగి విద్యాసాగర్ టీచర్ ను లక్ష్యంగా చేసుకొని తాను మాటలలో పెట్టి తాను టీచర్ కు సంబంధించిన డబ్బులను మిషిన్ లో డిపాజిట్ చేపిస్తానని నమ్మించి ఆమె దృష్టి మరల్చి 99 వేల రూపాయలను దొంగిలించి అక్కడనుండి వెళ్ళిపోయాడు. తన అకౌంట్ లో పూర్తి రెండు లక్షల రూపాయలలో రూ. 99 వేల రూపాయలు జమ కాలేదన్న విషయాన్నీ ఆలస్యంగా గమనించిన జయలక్ష్మి కేపిహెచ్ బి పోలీసులకు పిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎం వద్ద గల సిసి పుటేజ్ ద్వారా నేరస్తుడి కదలికలను గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ఈ నేరం చేసింది విద్యాసాగర్ గా గుర్తించి విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. అప్పటికే విద్యాసాగర్ తాను దొంగిలించిన డబ్బులలోరూ. 35 వేల రూపాయలను స్నేహితుడు నాగిపోగు బాలాజీకి ఇచ్చాడు. నేరాన్ని అంగీకరించిన విద్యాసాగర్, అతని స్నేహితుడు బాలాజీ నుండి రూ.70 వేల రూపాయలను, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఉన్నత చదువులు చదివినప్పటికీ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం విద్యాసాగర్ లాంటి వ్యక్తులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఇన్స్పెక్టర్ విజయ్ అన్నారు .విద్యాసాగర్ ను కేసు లో భాగంగా విచారిస్తే ఇప్పటివరకు 300 దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు అన్నారు.
కానీ విద్యాసాగర్ గుర్తింపు తో నేర చరిత్రను ఆరా తీయగా తెలంగాణ రాష్ట్రంలో పలు స్టేషన్లలో 19 కేసులు నమోదయినట్టు తెలుస్తుంది. వయోవృద్ధులు బ్యాంకులు ఏటీఎంలో వద్ద అప్రమత్తంగా ఉండాలని అపరిచితులను నమ్మవద్దని ఇన్స్పెక్టర్ విజయ్ సూచించారు.






