07-02-2026 12:19:33 AM
చిట్యాల, ఫిబ్రవరి 6 : నార్కట్‌పల్లి మండలంలో ఒంటరి వ్యక్తుల్ని టార్గెట్ గా చేసుకొని దోపిడీ చేస్తున్న ఇద్దరు దొంగలను నార్కట్ పల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి 65 పై ఫిబ్రవరి 2 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సునీల్ తివారి అనే డ్రైవర్ వెలిమినేడు గ్రామం నుండి ఐరన్ లోడ్ తో ఏపీ లింగోటం వద్ద ఉన్న యు ఎస్ టి పి ఎల్ వద్ద తన లారీని ఆపాడు.
లారీని అన్లోడ్ చేయడానికి సమయం ఉన్నందున ఈలోగా వంట చేసుకోవడానికి ఏపీ లింగోటం గ్రామ శివారులో ఉన్న కిరాణం షాప్ వద్దకు వెళుతున్నాడు. మార్గ మధ్యలో దాదాపు ఒంటి గంట 30 నిమిషాల సమయంలో ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని స్కూటీ పై వచ్చి లారీ డ్రైవర్ అయినా తివారి ని లిఫ్ట్ ఎక్కించుకున్నారు. ఈ తరుణంలో ఏపీ లింగోటం గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస టౌన్షిప్ దగ్గరికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు లారీ డ్రైవర్‌ను ఇనుప రాడుతో బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న సెల్ ఫోన్ ను తీసుకొని స్కూటీపై వెళ్లిపోయారు.
ఈ సంఘటన జరిగిన అనంతరం లారీ డ్రైవర్ సునీల్ తివారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న నార్కట్ పల్లి పోలీస్ సిబ్బంది కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆ ఇద్దరి నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నార్కట్‌పల్లి గ్రామానికి చెందిన ఎస్కే ఉమర్, యాడవల్లి గ్రామానికి చెందిన లింగస్వామి ఉన్నారు. నిందితులను జైలుకు పంపించామని నార్కట్ పల్లి ఎస్త్స్ర విష్ణు మూర్తి తెలియజేశారు.