07-02-2026 12:18:39 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కో ఆర్డినేటర్లుగా నియమించడంతో.. సొంత పార్టీ నేతలే ముక్కున వేలసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఉన్న వారిని కాదని, వలస నేతలకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించడంపైన పాత కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌లోకి వస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారా? అని కాంగ్రెస్‌లోని ఒక వర్గం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇటీవలనే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులో.. పార్టీ మారలేదంటూ స్పీకర్ ముందు వాదించుకుని అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యేలు .. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారని? కాంగ్రెస్ పాత క్యాడర్ మండిపడుతోంది.
రాజకీయాలంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, వారిపై పార్టీ ఫిరాయంపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అనర్హత అంశం ఆలస్యం అవుతుండటంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తొందరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది.
దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నారని, వారు పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలూ లేవంటూ అనర్హత పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. అయితే ఇప్పుడు అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకున్న 8 మంది ఎమ్మెల్యేలలో గాను ముగ్గురు ఎమ్మెల్యేలకు ఏకంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సమన్వయ కర్తలుగా నియమించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
నిజాబాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయ కర్తగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి, షాద్‌నగర్ సమన్వయకర్తగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు, ఇల్లెందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు కో ఆర్డినేషన్ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ఇక మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకు.. వారి నియోజకవర్గాల పరిధుల్లో జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ బాధ్యతలు కడియం శ్రీహరి, బాన్సువాడ నియోజకవర్గ బాధ్యతలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి చూసుకుంటున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎక్కడా ప్రచారం చేయకుండా స్థబ్ధతగా ఉంటున్నారు.
అయితే జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ సరితాతిరుపతయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, ఇందిర, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాసుల బాల్‌రాజు వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది.
టికెట్ల కేటాయింపుల్లో తమ వర్గానికి అన్యాయం జరిగిందని పాత కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఏమవుతుందో ఆర్థం కావడం లేదని పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు.