11 April, 2026 | 4:49 PM

అహల్యనగర్‌లో దొంగల హల్‌చల్

29-06-2024 12:05 AM
  • అర్ధరాత్రి ఇంటి తలుపులు బాది చోరీకి యత్నం
  • ఇనుపరాడ్డు, కట్టర్లు, కత్తులతో బీభత్సం
  • ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

హుజూరాబాద్, జూన్ 28 : హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని సైదాపూర్ రోడ్డులోగల అహల్యనగర్‌లో గురువారం అర్ధరాత్రి తర్వాత దొంగలు హల్‌చల్ చేశారు. కాలనీకి కరెంట్ సరఫరాను నిలిపివేసి, ఇనుపరాడ్డు, కట్టర్లు, కత్తులతో గంటకుపైగా స్థానికులను భయాందోళనకు గురిచేశారు. అహల్యనగర్‌లో రమేష్ కుటుంబంతో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. గురువారం రాత్రి ఐదుగురు దుండగులు రమేష్ ఇంటి చుట్టుపక్కల ఉన్న పలువురి ఇండ్లకు గొళ్లాలు పెట్టి, రమేష్ ఇంటి తలుపు బాది భయభ్రాంతులకు గురిచేశారు.

వెంటనే తేరుకున్న రమేష్ డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి స్థానికులు దొంగలపై తిరగబడడంతో నలుగురు పరారుకాగా ఒక్కర్ని పట్టుకున్నారు. దుండగులు హిందీతో పాటు కొద్దిగా తెలుగు కూడా మాట్లాడుతుండడంతో గత కొన్ని రోజులుగా వారు ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకున్నట్లు తెలుస్తున్నది. ఇండ్లను పరిశీలించి ప్లాన్ ప్రకారమే చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. హర్యానా, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అహల్యనగర్ ప్రాంతాల్లో సంచరిస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. పోలీసులు రాత్రివేళలో గస్తీ పెంచి చోరీలను అరికట్టాలని అహల్యనగర్‌వాసులు కోరుతున్నారు.