ఎంకేఆర్ మిల్లులో ౩౨ కోట్ల ధాన్యం మాయం
- 18వేల మెట్రిక్ టన్నులు అమ్ముకున్న యజమాని
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో విస్తుపోయే నిజాలు
సూర్యాపేట, జూన్ 22 (విజయక్రాంతి): రూ.32 కోట్ల విలువ చేసే ప్రభుత్వం ధాన్యం మాయమైన మరో ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఉన్న ఎంకేఆర్ రైస్ మిల్లులో సుమారు 18 వేల మెట్రిక్ ధాన్యం నిలువలు లేనట్లు శనివారం అధికారుల తనిఖీలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యం మరాడించి ఇవ్వడానికి మిల్లర్లకు ఇస్తే అవి తిరిగి సేకరించడంలో భారీగా అవకతవకలు జరిగాయని, సీఎంఆర్ సేకరించడంలో అధికారులు కొన్ని మిల్లులపై వివక్ష చూపారనే నేపథ్యంలో ఈ నెల 8న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురితమైన ‘సీఎంఆర్ సేకరణలో సిత్రాలు’, ౨౦న ప్రచురితమైన ‘రైస్ మిల్లర్ల జులుం’ కథనాలకు అధికారులు స్పందించారు.
గడ్డిపల్లిలో ఉన్న ఎంకేఆర్ రైస్ మిల్లులో శనివారం టాస్క్‌ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో విస్తూ పోయో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎంకేఆర్ మిల్లు నుంచి గత కొన్ని సీజన్లకు సంబంధించి 15,794 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1270 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 14,524 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉన్నది. ఈ ధాన్యం విలువ రూ. 32 కోట్లు ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన ధాన్యం నిలువలు మిల్లులో లేవని అధికారులు గుర్తించారు.
మిల్లులో రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మోహన్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అందిచాల్సిన సీఎంఆర్ సకాలంలో అందించని మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఎంకేఆర్ మిల్లులో తనిఖీ చేయగా ధాన్యం నిలువలు లేవని గుర్తించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తామని స్పష్టంచేశారు. తనిఖీల్లో సివిల్ సప్లయ్ అధికారులు రాములు, గరిడేపల్లి తహసీల్దార్ కవితారెడ్డి, హుజుర్‌నగర్ కోదాడ, డీటీలు రాజశేఖర్, రాంరెడ్డి, ఆర్‌ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






