7 May, 2026 | 11:22 PM

చెంచు మహిళకు నేతల బాసట!

23-06-2024 03:00 AM
  • బాధితురాలి కుటుంబానికి మంత్రి జూపల్లి ఆర్థిక సాయం 
  • మెరుగైన వైద్యం అందించడంలో అధికారులు విఫలం 
  • మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
  • ఉనికి కోసం బీఆర్‌ఎస్ ప్రయత్నాలు.. ఎంపీ మల్లు రవి

నాగర్‌కర్నూల్, జూన్ 22 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా మొలచింత లపల్లి చెంచు మహిళపై జరిగిన పాశవిక దాడి అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను శనివారం అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పరామర్షించారు. మొదట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలిని పరామరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిరు. దాడికి పాల్పడిన వారికి శిక్ష తప్పదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున భూమి ఇప్పిస్తానని చెప్పారు. ఇకపై ఆమె కుటుంబమే స్వయంగా వ్యవసాయం చేసుకుకోవ చ్చునని అన్నారు. ఆర్థికంగా రూ.౨ లక్షలు పరిహారం ఇస్తామని, ఆమె ముగ్గురు పిల్లలను ప్రభుత్వమే గురుకులంలో చేర్పించి నాణ్యమైన విద్య అందిస్తుందని భరోసా ఇచ్చారు. 

ఉనికి కోసమే బీఆర్‌ఎస్ నేతల పాట్లు : ఎంపీ మల్లు రవి

చెంచు మహిళకు జరిగిన అమానవీయ ఘటనలో ముందుగా స్పందించింది కాంగ్రెస్ పార్టీనే అని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పష్టంచేశారు. బాధిత మహిళ కుటుంబానికి రక్షణగా నిలిచి మెరుగైన వైద్యం, భరోసా కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనుమరుగవుతున్న క్రమంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే గులాబీ నేతలు పాట్లు పడుతున్నారని విమర్శించారు. విలువైన సూచనలు ఇస్తే స్వాగతిస్తామని.. అనవసరమైన వాదన, ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

నేతల పరామర్శలతో ఇతర రోగుల పాట్లు

చెంచు మహిళపై జరిగిన పాశవిక దాడితో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో అధికార, ప్రతిపక్ష లీడర్లు, మహిళా, ప్రజా సంఘాల నేతలు ఆ మహిళను పరామర్శించేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి క్యూ కట్టారు. దీంతో ఆ మహిళతో పాటు ఆసుపత్రిలోని ఇతర రోగులకు కూడా మెరుగైన వైద్యం అందడం లేదని రోగుల బందువులు, ఆసుపత్రి సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. 

నాణ్యమైన వైద్యం అందడం లేదు : మాజీ మంత్రి సత్యవతి

ప్రజాపాలనలో చెంచులకు రక్షణ లేకుండా పోయిందని, అత్యంత పాశవికంగా దాడి జరిగి చెంచు మహిళ చావుబతుకుల మధ్య అల్లాడుతున్నా ప్రభుత్వం ఆమెకు మెరుగైన వైద్యం అందిచట్లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. శనివారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దర్‌రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో కలిసి ఆమె బాధితురాలిని పరామర్శించింది. అనంతరం అక్కడినుంచే జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ భూమి నిందితులకు ఇవ్వొద్దని బాధితురాలు భర్తకు చెప్పినందుకే మానవత్వం మరిచి దాడి చేశారని ఆరోపించారు. దాడిచేసినవారి పేర్లు చెబితే చంపుతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. దాడిచేసిన వారికి పోలీసులు స్టేషన్‌లో మర్యాదలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దోషులు ఏ పార్టివారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు.