30 August, 2026 | 4:17 AM

యూనిక్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది

30-08-2026 12:22 AM

సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ రూపొందుతున్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్‌కు రాబోతోంది.

ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ.. “నాకు రంగస్థలం తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని సంతోషాన్ని కలిగించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ సినిమా మనసంతా నిండి నా భుజాలపై మోసేదాకా వచ్చింది.  డబ్బులు వచ్చేలా చేస్తేనే మంచి సినిమా అనే నమ్మకాన్ని వదిలి మంచి సినిమా చేస్తే డబ్బులు వస్తాయని మనసారా నమ్మి ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు జై జ్ఞాన ప్రభ” అన్నారు.

‘ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చా. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టే మూవీకి ఒప్పుకున్నా’ అని హీరోయిన్ వితికా షేరు తెలిపింది. ‘మా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపర్చదు. తప్పకుండా మీ అందరినీ ఎంగేజ్ చేసేలా ఉంటుంద’ని డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ చెప్పారు. ‘సినిమా ఔట్ పుట్ మీ అందరికీ నచ్చేలా వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నామ’ని నిర్మాత మేరుం భాస్కర్ అన్నారు. నటులు శివకుమార్, నటరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్, ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల కూడా మాట్లాడారు.