25 March, 2026 | 1:49 AM

ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన

25-03-2026 12:05 AM

దివ్యాంగుల ఛలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు.. 

నిజామాబాద్ మార్చ్24 (విజయక్రాంతి): దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అన్ ఎంప్లాయిడ్ డిసేబుల్ అసోసియేషన్ ఆఫ్ యూత్ మంగళవారం నిర్వహించిన ఛలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ..వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా..మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీ ల అమలు ఎలాగో పూర్తి స్థాయిలో జరగడం లేదు, కనీసం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రధానంగా వారికి స్కూటీ అందజేస్తామని చెప్పి విస్మరించారన్నారు.

స్వయం ఉపాధి కింద ఇస్తున్న రూ.50 వేల ఋణం ఏమాత్రం సరిపోవడం లేదని, దీన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముందు పోలీసులు అడ్డుకోవడం తో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్ తో కలిసి గన్ పార్క్ అమరవీరుల పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.