25 March, 2026 | 1:37 AM

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

25-03-2026 12:04 AM
  1. ఫీజు బకాయిలు చెల్లింపునకు ఏప్రిల్ 3న కలెక్టరేట్‌ల ముట్టడి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

బీసీల నినాదాన్ని నీరుగార్చేందుకే ఫీజు రీయింబర్స్మెంట్  చెల్లించడం లేదు

ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

ముషీరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని, బీసీ గురుకుల పాఠశాలలో 20 శాతం సీట్లు పెంచాలనే డిమాండ్ తో ఏప్రిల్ 3న డిమాండ్ల సాధనకై తరగతులు బహిష్కరించి కలెక్ట రెట్లు ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.

బీసీ విద్యార్ధుల సమావేశం మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్ధి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్ర శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించక పోవడంతో అష్ట కష్టాల పాలు అవుతున్నారని అన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వ డం లేదన్నారు. కాలేజీ యాజమాన్యాలు భవనాల అద్దె కట్టలేక, లెక్చరర్ల జీతాలు ఇవ్వక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లెక్చరర్లు, జీతాలు రాక కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నా రు.

ఫీజుల స్కీమును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తుందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఫీజుల పథకానికి రూ.6 వేల కోట్లు అప్పు చేస్తే ఎవ రు అడ్డుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో రూ.20 కూడా విడుదల చేయలేదని అన్నారు.

మాజీ శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ తెలంగాణలో విస్తరిస్తున్న బీసీ నినాదాన్ని నీరుగార్చేందుకే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదని ఆరోపించారు. బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు, చెల్లింపులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్, బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపెళ్లి అంజి, నాయకులు కొండ దేవయ్య, గొరిగి మల్లేష్, మేకల రాములు యాదవ్, మోడీ రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.