11 May, 2026 | 9:48 AM

ఇటు సబలెంకా అటు సిన్నర్

21-08-2024 12:26 AM

మాసన్ (అమెరికా): సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ విజేతలుగా జానిక్ సిన్నర్, అరీనా సబలెంకా నిలిచారు. ఇటు ఫ్రాన్సెస్ టియాఫోపై ప్రపంచ నంబర్‌వన్ సిన్నర్ .. అటు జెస్సికా పెగులాపై ప్రపంచ రెండో ర్యాంకర్ సబెలంకా విజయాలు నమోదు చేసుకొని చాంపి యన్లుగా నిలిచారు. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ గెలవడం ఇద్దరికి ఇదే తొలిసారి కావడం విశేషం. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకా 6-3, 7-5 పెగులా (అమెరికా)పై సునాయాస విజయాన్ని అందుకుంది.

గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో సబలెంకా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్న బెలారస్ బామ పెగులాను వరుస సెట్లలో ఖంగుతినిపించింది. మ్యాచ్‌లో 10 ఏస్‌లు కొట్టిన సబలెంకా 3 బ్రేక్ పాయింట్లు సాధించింది. మరోవైపు కేవలం 5 ఏస్‌లు మాత్రమే కొట్టిన పెగులా ఐదు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. కాగా సబలెంకా సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ గెలవడం ఇదే తొలిసారి కాగా.. ఆమె ఖాతాలో ఇది 15వ డబ్ల్యూటీఏ టైటిల్. 

టైటిల్  గెలిచిన పిన్నవయస్కుడిగా..

పురుషుల సింగిల్స్‌లో ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ విజేతగా అవతరించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో సిన్నర్ 7 (7/4), 6 అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియాఫోను వరుస సెట్లలో ఓడించాడు. గంటా 38 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఇద్దరు హోరాహోరీగా ఆడడంతో తొలి సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే టియాఫో మూడు వరుస తప్పిదాలు చేసి సెట్‌ను కోల్పోయాడు. ఇక రెండో సెట్‌లో టియాఫోకు సిన్నర్ ఏ మాత్రం అవకాశమివ్వలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సిన్నర్ 40 నిమిషాల్లోనే సెట్‌ను గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌లో 13 ఏస్‌లు కొట్టిన సిన్నర్ రెండు బ్రేక్ పాయింట్లు సాధించాడు.

తొలిసారి సిన్సినాటి మాస్టర్స్ నెగ్గిన సిన్నర్ టైటిల్ అందుకున్న పిన్న వయస్కుడిగానూ రికార్డులకెక్కాడు. గతంలో 2008లో ఆండీ ముర్రే (21 ఏళ్లు) ఈ ఫీట్ సాధించాడు. ఆగస్టు 26 నుంచి సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ మొదలుకానుం ది. ఈ నేపథ్యంలో సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో విజేతలుగా నిలిచి సబలెంకా, సిన్నర్‌లు పూర్తి ఆత్మవిశ్వాసంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు సిద్ధమయ్యారు. ఇక జానిక్ సిన్నర్ నిషేధిత స్టెరాయిడ్ అయిన అనబాలిక్ తీసుకున్నట్లు తేలింది. అయితే అతనిపై ఎలాంటి నిషేధం పడే అవకాశం లేదు. అయితే ఇండియన్ వెల్స్, కాలిఫోర్ని యా టోర్నీల్లో సిన్నర్ సాధించిన ప్రైజ్‌మనీ, పాయింట్లలో కోత విధించనున్నారు.