16 May, 2026 | 1:40 PM

శంకర్‌పల్లిలో చిరు ఇంట్రో సాంగ్ షూటింగ్

16-02-2025 12:00 AM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సోషియో- ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ఈ ప్రాజెక్టును దర్శకుడు వశిష్ట అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్  కథానాయికలుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. ఇక్కడి ప్రత్యేక సెట్‌లో తాజా షెడ్యూల్ కొనసాగుతుండగా, చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు.

ఈ పాట కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ ఓ మ్యాసీవ్ సెట్‌ను రూపొందించారు. ఎంఎం కీరవాణి ఈ పాట కోసం పవర్‌ఫుల్ మాస్ అంథమ్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.

సాంగ్ షూట్ గురించి అప్‌డేట్ ఇస్తూ మేకర్స్ విడుదల చేసిన ఫొటోలో చిరంజీవి కారు దిగుతూ కూల్ అండ్ స్టులిష్‌గా, షార్ఫ్ లుక్స్‌తో కనిపించారు. ఈ చిత్రానికి డీవోపీ: చోటా కే నాయుడు. 

‘విశ్వంభర’లో సాయి దుర్గాతేజ్..

‘విశ్వంభర’ చిత్రంలో సాయి దుర్గాతేజ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కల్యాణ్, నాగబాబుతో నటించిన తేజ్.. తనకు చిరంజీవి సినిమాలో నటించాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు వెల్లడించాడు. తాజాగా ఆయన ‘విశ్వంభర’లో భాగమయ్యాడని తెలుస్తోంది. ఒక అతిథి పాత్రలో నటిస్తున్నాడట. ఈ వార్త నిజమే అయితే సాయి దుర్గా తేజ్ కల ఈ సినిమాతో నెరవేరినట్టే.