03-02-2026 12:31:15 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో మీడి యా వేదికగా ఆయన మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని ప్రశ్నించారు. తప్పుచేసి మాపైనే అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరి మీదా కక్ష సాధింపు ఆలోచన లేదని శ్రీధర్‌బాబు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చిందన్నారు. సాధారణంగా ఉగ్రవాదులు, ఆటంకవాదుల ఫోన్లను ట్యాప్ చేస్తారని.. కానీ ఇక్కడ నాయకులు, జడ్జిలు, వ్యాపారవేత్తల ఫోన్లనే ట్యాప్ చేశారని చెప్పారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో విచారణ జరుగుతోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు?
ఎందుకు చేశారో? తేల్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారని ప్రస్తావించారు. వారి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు చెపుతున్నారన్నారు. ఈ నీచానికి ఎవరు ఒడిగట్టారో విచారణ జరిపిస్తున్నామని తెలి పారు. దుశ్చర్యకు పాల్పడ్డవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
మంథని/కాటారం(విజయక్రాంతి): ము న్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజ లు గెలిపించాలని, కాంగ్రెస్ గెలుపుతో ము న్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం ఆయన భూపాలపల్లి జిల్లా కాటారం పంటల కేంద్రంలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థులను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక అంశాలను ప్రస్తావించిన శ్రీధర్ బాబు రాష్ట్ర విభజన సమయంలో 42 అంశాలు పరిష్కారం కాలేదన్నారు.