03-02-2026 12:30:20 AM
కాంగ్రెస్ ప్రభుత్వంపై కప్పాటి పాండురంగా రెడ్డి ఫైర్
కందుకూరు, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఒప్పందాలతో (MoUs) తెలంగాణ యువతను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూరు మండల కేంద్రం లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కేవలం కాగితాలకే పరిమితమైందని, వాస్తవంలో పెట్టుబడులేవీ రాలేదని ఆయన ఆరోపించారు.
ఉనికిలో లేని, అడ్రస్ లేని నకిలీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా పర్యటనలో రూ. 1000 కోట్ల ఒప్పందం చేసుకున్న ’స్వచ్ బయో’ కంపెనీ, ఆ ఒప్పందానికి కేవలం రెండు వారాల ముందే పుట్టిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు దొంగ ఒప్పందాలతో నిరుద్యోగులను మరోసారి వంచిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఫోటోలకు ఫోజులివ్వడం మానేసి, చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.