17 April, 2026 | 8:23 PM

నీతులు చెప్పేవారు.. అవి పాటించారా?

16-05-2025 12:00 AM
  1. ప్రొటోకాల్ అంటూ.. ప్రొటోకాల్ ఉల్లంఘన 
  2. కొప్పులపై బీఆర్‌ఎస్ నాయకుల ఆగ్రహం 

ఎల్బీనగర్, మే 15 : నీతులు చెప్పేవారు నీతులు పాటించారా? పదేపదే ప్రోటోకాల్ అంటూ గాయిగత్తర చేసేవాళ్లు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తారా?... ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే అభివృద్ధి పనులు గుర్తుకు వస్తాయా? అని కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన్సూరాబాద్ డివిజన్ లోని ఇందిరానగర్ కాలనీలో గురువారం బీఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ లో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ జక్కిడి మల్లారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, మాజీ డైరెక్టర్ టంగుటూరి నాగరాజు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి  తదితరులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సమావేశంలో వారు మాట్లాడుతూ... బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి ప్రోటోకాల్ గురించి పదేపదే మాట్లాడుతున్నాడని, ఆయనే ప్రోటోకాల్ పాటించకుండా అభివృద్ధి పనులకు ఎలా శంకుస్థాపన చేస్తారన్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రితో కలిసి శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో చెప్పకుండా శంకుస్థాపనలు చేసిన కొప్పుల నర్సింహరెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. నాలుగున్నర సంవత్సరాలు మన్సూరాబాద్ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేసి, ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే అభివృద్ధి పనులు అంటూ గాయిగాయి చేస్తున్నారని మండిపడ్డారు.

మూడు నెలలుగా అనితా నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ను  ఇన్ చార్జి మినిస్టర్ ప్రారంభించిన పనిని మళ్లీ కార్పొరేటర్ ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. అదే కాలనీలో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పిలవకుండా మళ్లీ ప్రారంభించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 

చిత్రసీమ కాలనీ లో బీటీ రోడ్, సూర్యోదయ కాలనీ హైవే కాలనీలో  భూగర్భంలో డ్రైనేజీ పనులను తిరిగి ప్రారంభించిన నర్సింహ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని తగిన సమయంలో మీకు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.