11 June, 2026 | 2:23 AM

ఏడాదికి 8 వేల రోడ్డు ప్రమాదాలు

11-06-2026 01:52 AM

నేరాల కంటే అధికం

అతివేగం, మద్యం మత్తు.. ప్రాణాలకు ముప్పు

హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్

ప్రత్యేకంగా భద్రతా కమిటీల ఏర్పాటు : కలెక్టర్ హైమావతి

ప్రమాద, చలానా రహిత జిల్లాగా మార్చాలని సీపీ పిలుపు

సిద్దిపేట క్రైం, జూన్ 10: సమాజంలో నేరాల కంటే రహదారి ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడాదికి సగటున 800 హత్యలు జరుగుతుంటే.. దాదాపు 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రహదారి భద్రత అవగాహన సదస్సుకు శిఖా గోయల్ ముఖ్య అతిథిగా, కలెక్టర్ కె. హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ విశిష్ట అతిథులుగా హాజరై మాట్లాడారు.

గ్రామీణ ప్రాంత రోడ్లపైనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిం చారు. సురక్షితంగా  ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యం చేరాలనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. రహదారిపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే, వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ సభల్లో కూడా ప్రత్యేకంగా భద్రతా కమిటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించడం కూడా పోలీసుల బాధ్యత అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఇటీవల మిట్టపల్లి వద్ద రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని కారు ఢీకొట్టిన ప్రమాదాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించి సిద్దిపేట జిల్లాను ప్రమాద రహిత, చలాన్ రహిత జిల్లాగా మార్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ప్రారంభంలో రహదారి భద్రతపై అవగాహన వీడియోలను ప్రదర్శించారు.

అనంతరం ‘కనువిప్పు’ బృందం ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా ప్రమాణాలు, ఉల్లంఘనలపై ఆలపించిన చైతన్య గీతాలు ఆకట్టుకున్నాయి. కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డీజీపీ శిఖా గోయల్  ప్రారంభించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కంటి అద్దాలు, మెడికల్ కిట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.