4 September, 2026 | 8:13 AM

తీరని వరద వెతలు

04-09-2026 | 06:20am
  1. నేపాల్‌లో మృతుల సంఖ్య 1,252కు చేరిక
  2. ఇంకా దొరకని 4,875 మంది ఆచూకీ
  3. ఎడతెరిపి లేని వర్షాలతో కొత్త వరదల ముప్పు
  4. భోటెకోషి, త్రిశూలి తదితర నదుల్లో వరద ఉధృతం
  5. దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

కాఠ్మండు, సెప్టెంబర్ 3: నేపాల్‌(Nepal)లో భారీ ఆకస్మిక వరదల సంభవించి తొమ్మిదిరోజులైనా వరద వెతలు ఇంకా తీరడం లేదు. కుటుంబీకులను పోగొట్టుకున్న వారి కన్నీటి రోదనలు ఆగడం లేదు. కడసారి చూపు కోసం పడుతున్న బాధితుల బాధతలు వర్ణనాతీతం. ఈ విపత్తులో మృతుల సంఖ్య గురువారం నాటికి 1,252కు చేరింది. ఇంకా 4,875 మంది ఆచూకీ దొరకలేదు.

తొమ్మిదోరోజూ సహాయక చర్యలు రేయింబవళ్లు కొనసాగుతున్నాయి. ఈ విపత్తును ‘హిమాలయ న్ సునామీ’గా నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్(Nepal's Foreign Minister Shisir Khanal) అభివర్ణించారు. అదే సమయంలో, భోటెకోషి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల కొత్తగా వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

ఆగస్టు 26న నేపాల్- సరిహద్దు సమీపంలో మంచు-కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన ఈ ఆకస్మిక వరదలు.. ఉత్తర, మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను అతలాకుతలం చేశాయి. నేపాల్ పోలీసులు గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చిత్వాన్ జిల్లాలో 355 మృతదేహాలు, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమలో 208, నువాకోట్‌లో 177 మృతదేహాలను వెలికితీశారు. అదేవిధంగా, రసువా జిల్లాలో 127, గోర్ఖలో 69, ధాడింగ్‌లో 60, తహనులో 38 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

చైనా వైపు, నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌లోని గ్యిరోంగ్ కౌంటీలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. అలాగే ఇంకా 541 మంది గల్లంతయ్యారు. నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు గురువారం తొమ్మిదవ రోజు కూడా తమ గాలింపు, సహాయక చర్యలను కొనసాగించాయి. ఇంకా మొత్తం గల్లంతైన వారి సంఖ్య 4,875గా అంచనా వేశారు. గల్లంతైన వారి కుటుంబాలు వారి కోసం ప్రతీకాత్మక బొమ్మలను తయారు చేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి.

ఇదే సమయంలో, వరదల కారణంగా టిబెట్‌లో సుమారు 100 మంది నేపాలీలు గల్లంతయ్యారని నేపాల్ ఎంఈఏ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి తెలిపారు. టిబెట్‌కు వెళ్లి చిక్కుకుపోయిన 3,000 మంది నేపాలీ పౌరుల్లో 2,500 మంది నేపాల్‌కు తిరిగి వచ్చారని, కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇంకా 1,500 మంది చిక్కుకున్నట్లు తెలిపారు. అలాగే భోటెకోషి నది ఎగువ ప్రాంతాల్లో గురువారం కూడా వర్షాలు కురిశాయి.

దీంతో భోటెకోషి, త్రిశూలి నదులతో పాటు రసువా, నువాకోట్ జిల్లాల్లోని చిన్న నదులు, వాగులలో నీటి మట్టాలు పెరుగుతున్నాయని అవకాశం ఉందని జలవనరులు, వాతావరణ శాఖలోని వరద అంచనా విభాగం తెలిపింది. నది పరిసర ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కాళికోట్, హుమ్లా, జుమ్లా, దైలేఖ్, దార్చులా, బైతడి వంటి పర్వత ప్రాంత జిల్లాల్లోని నదులు కూడా ఉప్పొంగుతున్నాయని, దీనివల్ల ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 

విద్యార్థులు.. ఎన్‌పీఆర్ 14,255 విరాళం

అంతర్జాతీయ, దేశీయ సహాయం వెల్లువెత్తుతున్నప్పటికీ, నేపాల్‌లోని కొంతమంది పాఠశాల విద్యార్థులు కూడా విరాళం ఇస్తున్నారు. వారి రోజువారీ చిరుతిండి ఖర్చును, చిన్న పొదుపును విరాళంగా అందజేశారు. సుమారు 1,500 మంది విద్యార్థులకు ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యార్థి నేతృత్వంలోని బాలల క్లబ్ సభ్యులు దీనికి నడుం బిగించారు.

ఈ పిల్లల సంఘం మొదటి రోజు ఎన్‌పీఆర్8,785, రెండో రోజు ఎన్‌పీఆర్ 5,470 సేకరించగా.. మొత్తం ఎన్‌పీఆర్ 14,255 సమకూరింది. ఈ మొత్తాన్ని రాష్ట్రీయ బనిజ్య బ్యాంక్ ద్వారా ప్రధాన మంత్రి సహాయ నిధిలో జమ చేసినట్లు టీచర్ ధన్ కుమార్ తెలిపారు.

ఇది ‘హిమాలయ సునామీ’: మంత్రి శిశిర్‌ఖనాల్

దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టించిన వరదలను ‘హిమాలయన్ సునామీ’గా నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ గురువారం అభివర్ణించారు. ఈ క్లిష్ట సమయంలో మద్దతు, సంఘీభావం తెలిపిన పొరుగు దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాఠ్మండులోని అంతర్జాతీయ దౌత్యవేత్తలకు గురువారం వివరిస్తూ..  ‘ఇటీవలి కాలంలో మేము ఇంతటి భారీ విపత్తును ఎప్పుడూ చూడలేదు, అందుకే దీనిని ‘హిమాలయన్ సునామీ’గా పిలుస్తున్నామని స్పష్టం చేశారు.